ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్ల పైకి వచ్చేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ పని లేకపోయినా జులాయిగా రోడ్లపై తిరిగేవారిని చితక్కొడుతున్నారు. అత్యవసర ప్రయాణాలకు ప్రభుత్వం పాసులు మంజూరు చేస్తుండగా.. పాసులు లేకుండా రోడ్డెక్కేవారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని పలమనేరులో స్థానిక సీఐ తన సొంత కుమారుడికే ఫైన్ విధించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే సొంత కొడుకునైనా విడిచేది లేదని ఈ చర్యతో సీఐ నిరూపించారు.
చిత్తూరు జిల్లా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెబుతున్న చిత్తూరు జిల్లా, పలమనేరు సీఐ జయరామయ్య కన్నకొడుక్కే ఫైన్ వేశారు. పలమనేరు పట్టణంలో బుధవారం(మే 13) సీఐ జయరామయ్య కానిస్టేబుళ్లతో కలిసి విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒకచోట 20 ఏళ్ల యువకుడు పోలీస్ కానిస్టేబుల్‌కి పట్టుబడ్డాడు. ఏ పని లేకపోయినా టైమ్ పాస్‌కి అతను రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించాడు. దీంతో అతన్ని పట్టుకుని సీఐ వద్దకు తీసుకొచ్చాడు కానిస్టేబుల్. అయితే ఆ యువకుడు సీఐ కొడుకు అని తెలియడంతో కానిస్టేబుల్ ఆయనకు సారీ చెప్పాడు. కానీ సీఐ మాత్రం చట్టం ముందు అందరూ సమానమేనని… అందరికీ వేసినట్లే తన కొడుకుకు కూడా ఫైన్ వేయాలని కానిస్టేబుల్‌ను ఆదేశించాడు. కన్నకొడుకు అయినా తప్పు చేస్తే శిక్షించాల్సిందేనంటూ రూ. 125 ఫైన్ వేశారు. అంతే కాకుండా మరోసారి బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఈసారికి జరిమానాతో వదిలేస్తున్నామని… మరోసారి బయట కనిపిస్తే కేసు బుక్ చేస్తామని సీఐ తన కొడుకుకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని చెప్పడంతో అతన్ని వదిలేశారు.
ఇది కూడా చదవండి: జనం తగ్గేదే లే… కోవిడ్ పరీక్షల కంటే మద్యం కొనుగోళ్లకే ప్రాధాన్యం