ఆర్థిక స్వాలంబన, ఆత్మగౌరవంతో జీవించడమే లక్ష్యం
బాబు జగజ్జీవన్ రామ్ కు నిజమైన నివాళి
ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
తిరుపతి, – సామాజిక సమానత్వం..అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అలుపెరగక పోరాటం సాగించిన విప్లవ యోధుడు, మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి కొనియాడారు. అణగారిన వర్గాలు ఆర్థిక స్వాలంబన, ఆత్మగౌరవంతో జీవించడమే.. బాబు జగజ్జీవన్ రామ్ కు నిజమైన నివాళి అర్పించడమవుతుంది అన్నారు. సోమవారం బాబు జగజ్జీవాన్ రామ్ 113వ జయంతి సందర్భంగా బైరాగిపట్టెడలోని తుడా పార్కులో ఆయన విగ్రహానికి తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తో పాటు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి మాట్లాడారు. జాతి జనులు విద్యావంతులుగా, ఆత్మాభిమానం కలవారిగా చేయడమే లక్ష్యంగా కృషి చేశారన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిస్తే చట్ట రూపంలో అమలు చేయడంలో బాబు జగజ్జీవన్ రామ్ కృషి మరువలేనిదన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలు ఐకమత్యంతో మెలిగి విద్యను ఆయుధంగా మలుచుకొని అభివృద్ది చెందాలన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా జనరంజక పాలన అందిస్తున్నారని అన్నారు. మహానీయులు బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కట్టుబడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాధికారం తో పాటు అన్ని రంగాలలో తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి యు పాలక మండలి సభ్యులు మల్లారపు మధు పలువురు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.