తిరుపతి – తిరుపతి ఉప ఎన్నికకు పోలింగ్ నేటి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది… అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. నెల్లూరు, తిరుపతిలలోని గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీంగ్ కేంద్రాలకు తరలి వచ్చారు.. అర్బన్, నగర ప్రాంతాలలో ఓటర్లు మాత్రం పోలింగ్ పై అంత అసక్తి చూపలేదు.. పట్టణ, నగరాలలోకి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోతున్నాయి… వ్యవసాయ సీజన్ కావడంతో గ్రామీణ ప్రాంత పోలింగ్ కేంద్రాలకు ఉదయం 10 గంటల తర్వాత ఓటర్ల రాక తగ్గింది… దీంతో తొలి రెండు గంటలలో కేవలం 7.80 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది…కాగా ప్రధాన పార్టీల అభ్యర్ధులతో పాటు మొత్తం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం బరిలో 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా పోలింగ్‌కు అవకాశం కల్పించారు. వెయ్యి ఓట్లకు ఒక పోలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఇక ఈ నియోజకవర్గం పరిధిలో 466 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఓటర్లందరూ కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తూ కరపత్రాలను అంటించారు. 80 ఏళ్ల వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. 22,743 మంది వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు. కాగా, 10,850 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 50శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కొనసాగుతున్నది.. కాగా, పార్లపల్లి, కొత్తపాలెం గ్రామాల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దాంతో సదరు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి
కుక్కంభాకం గ్రామంలో అదే పరిస్థితి తలెత్తింది… వాటిని సరిచేసి అనంతరం తిరిగి ఇక్కడ పోలింగ్ ప్రారంభమైంది.
దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ నిరసన..
ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. తిరుపతి లక్ష్మీపురం చౌరస్తా వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దొంగ ఓట్లు వేయించేందుకు బయటి వ్యక్తులను తీసుకువచ్చారని ఆరోపించారు. ఎన్నికల సంఘం, అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకురాలు సుగుణమ్మ డిమాండ్ చేశారు.