Tuesday, November 26, 2024

Tirupati: అప్రమత్తంగా ఉన్నాం – నిరంతరంగా పర్యవేక్షస్తున్నాం.. కలెక్టర్

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : భారీ వర్షాలపై ప్రత్యేక బృందాలతో పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాలపై తుఫాన్ ప్రభావం తెలుసుకుని తగు ఆదేశాలు ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 8 జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఇతర జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఆ సందర్బంగా జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అందులో భాగంగా జిల్లా యంత్రాంగం పూర్తిగా తుఫాన్ కార్యక్రమాల్లో నిమగ్నమైందని, సాదారణ వర్షపాతం కన్నా కొన్ని మండలాల్లో అధికంగా ఈ 3 రోజుల్లో నమోదు అయిందని చెప్పారు. ఇప్పటివరకు 31 గ్రామాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి 2,620 మందికి వసతి, భోజనం, త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించామని, అలాగే 162 మంది ప్రసవ సమయానికి 10 నుండి 15 రోజులు ఉన్న గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులలో చేర్పించామని తెలిపారు.

రాత్రి నుండి గాలుల ప్రభావం అధికంగా వుందని చాలా చోట్ల చెట్లు పడిపోతున్నాయని, ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. గత నెల 30నుండి వర్షాలు పడుతున్నాయని, దురదృష్ట వశాత్తు గుడిసె మట్టిగోడ కూలి 4 సంవత్సరాల బాలుడు మృతి చెందాడని, ఆ కుటుంబానికి ఈరోజు రూ. 4 లక్షలు పరిహారం అందించనున్నామని తెలిపారు. జిల్లాలో పలుచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రాజెక్టుల్లో కళ్యాణి డ్యాం మినహా ఇతర జలాశయాలు, జిల్లాలోవున్న 2,557 చెరువుల్లో 1500 వరకు పూర్తిగా నిండాయని, మరో 600 చెరువుల్లో 50 నుండి 70శాతం వరకు నిండాయని వివరించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని వివరించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి వరి కోతలు పూర్తియినందున పెద్ద నష్టం లేదని, ఉద్యానవన పంటలకు సంబంధించి 25ఎకరాల్లో ఇప్పటివరకు దెబ్బ తిన్నాయని వివరించారు. గాలులు అధికంగా వుండట౦తో విద్యుత్ స్థంబాలు 33 కెవి 13 పోల్స్ , 11 కేవీ పోల్స్ 16, సబ్ స్టేషన్లు 29 వరకు డ్యామేజ్ అయ్యాయని, అవకాశం వున్నచోట పునరుద్దరణ యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నామని, తుఫాన్ ప్రభావం తగ్గిన 48 గంటల్లో పూర్తిస్థాయి నివేదిక అందిస్తామని చెప్పారు.


ఈరోజు ముఖ్యమంత్రి సూచించిన విధంగా పునరావాస కేంద్రాల నుండి ఇళ్ళకు వెళ్ళే సమయంలో ఒక్కరికి రూ.1000/, కుటుంబానికి 2500/ అందిస్తామని తెలిపారు. ఈ సమీక్షలో కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్.పి. పరమేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ తదితర అధికారులు హాజరయ్యారు. ఎక్కడా సహాయం అందలేదనే మాట వినిపించకూడదని, అప్రమత్తంగా ఉండి సమస్యలపై వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement