తిరుపతి : జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ ముగిసింది. ఇక జనవరి 12వ తేదీ నుండి ఏ రోజు కారోజు దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో మునుపటిలాగానే ఎస్ ఎస్ డీ టోకెన్లు జారీ చేయబడతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14న భోగితేరు, 15న మకర సంక్రాంతి – జనవరి 16న గోదా పరిణయోత్సవం..
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14న భోగితేరు, జనవరి 15న మకరసంక్రాంతి జరుగనున్నాయి. జనవరి 14న భోగి పండుగ రోజున సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణ స్వామి వారిని భోగి తేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు. జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. బాలాలయం జరుగుతున్న కారణంగా జనవరి 16న కనుమ రోజు నిర్వహించే పార్వేట ఉత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
జనవరి 16న గోదా పరిణయోత్సవం
శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 16న గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉదయం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి మేల్‌ఛాట్ వస్త్రం, పూలమాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మవారికి సమర్పిస్తారు. సాయంత్రం శ్రీ గోదా పరిణయోత్సవం వేడుకగా నిర్వహిస్తారు.