Friday, November 22, 2024

తిరుమ‌ల‌లో గ‌దుల కేటాయింపు వ్య‌వ‌స్థ తిరుప‌తికి త‌ర‌లింపు : టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి

తిరుమల : తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వ‌ర‌లో తిరుపతిలో చేపట్టనున్న‌ట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవో టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి భక్తులకు వివరించారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల సమిష్టి కృషి, భక్తుల సహకారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయి. టీటీడీ అధికారులు, సిబ్బంది, ఎస్వీబీసీతోపాటు తమ ఛానళ్లలో శ్రీవారి వైభవాన్ని భక్తులకు తెలియజేసిన ప్రచార, ప్రసార సాధనాల ప్రతినిధులకు మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి సెప్టెంబరు 27వ తేదీ తిరుపతి నుండి తిరుమలకు విద్యుత్‌ బస్సులు ప్రారంభించారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయం. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుంది. త్వరలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదలుపెడతాం. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న విఐపి బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలుచేస్తాం. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరుతున్నాం.

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్‌ ఎన్‌టిఆర్‌ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగనున్నాయి. డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలు, జనవరిలో ఢిల్లీ లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తాం. పవిత్రమైన కార్తీక మాసంలో గత ఏడాది తరహాలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తాం. ఉత్తరాయణంలో చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, జమ్మూలోని శ్రీవారి ఆలయాలకు మహాసంప్రోక్షణ చేపడతాం. అహ్మదాబాద్‌ నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గుజరాత్‌ ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఇచ్చింది. త్వరలో భూమిపూజ చేస్తాం. అక్టోబరు నెలలో ఏజన్సీ ప్రాంతాలైన అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తాం.

సెప్టెంబ‌రు నెలలో నమోదైన వివరాలు :
దర్శనం : శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 21.12 లక్షలు.
హుండీ : హుండీ కానుకలు – రూ.122.19 కోట్లు.
లడ్డూలు : విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 98.74 ల‌క్ష‌లు.
అన్నప్రసాదం : అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 44.71 లక్షలు.

కల్యాణకట్ట : తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 9.02 లక్షలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement