Friday, November 22, 2024

పరిశ్రమలకు తిరుపతి జిల్లా అన్నివిధాలా అనుకూలం.. కలెక్టర్

సత్యవేడు (రాయలసీమ ప్రభ వెబ్ న్యూస్) : కొత్త పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అన్ని విధాలా అనుకూలమని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి పారిశ్రామిక వేత్తలతో అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీసిటీలోని సమావేశ మందిరంలో వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన  మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించే దిశలో సింగిల్ డెస్క్ పారిశ్రామిక విధానంలో అనుమతులు ఇవ్వడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వలన పరిశ్రమల స్థాపనకు కావలసిన అన్ని అనుమతులు సులభతరం అయ్యాయన్నారు. రాష్ట్ర పురోభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యంకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. మన ముఖ్యమంత్రి నూతన పరిశ్రమల ప్రోత్సాహానికి పెద్ద పీట వేసి ఎంఎస్ఎంఈ లను, కొత్త ఎంటర్ ప్రెన్యూర్ లను ప్రోత్సహిస్తున్నరన్నారు. 

శ్రీసిటీలో ఉన్న పరిశ్రమలకు, జిల్లాలోని ఇతర ప్రాంతాల పరిశ్రమలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే వాటిని జిల్లా స్థాయిలో పరిష్కారానికి వీలైతే సత్వరమే చర్యలు చేపడతామని, ఈ సమావేశానికి సుమారు 120కి పైన పరిశ్రమల ప్రతినిధులు హాజరవడం ఎంతో సంతోషించ దగిన విషయమన్నారు. శ్రీసిటీ పరిధిలో పి.ఎఫ్ కార్యాలయం, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు, రహదారుల విస్తరణ, మరమ్మత్తులపై, వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. కొంత మంది పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ… ఐ టి ఐ, డిప్లొమా అభ్యర్థులు తగినంత మంది లేరని తెలుపగా కలెక్టర్ మాట్లాడుతూ… ఇతర జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామన్నారు. శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ రవి సన్నారెడ్డి మాట్లాడుతూ… శ్రీసిటీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ తొందర్లోనే ప్రారంభం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ సూహాన సోనీ, సి పి ఓ అశోక్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ రామకృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నాగేశ్వర్ రావు, ఏఈ మదన మోహన్, రవాణా శాఖ తదితర అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement