Tuesday, November 19, 2024

తిరుప‌తిలో పార్టీల మోహ‌రింపు…..

మాజీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెదేపా సన్నద్ధం
వ్యూహాత్మకంగా సన్నద్ధమైన వైకాపా, తెదేపా
ఎంపీలు, సీనియర్లతో భాజపా పర్యవేక్షక కమిటీ
తిరుపతి ఉప ఎన్నికకు రేపే నోటిఫికేషన్‌
ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ

తిరుపతి, – తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి వచ్చే నెల 17న జరగనున్న ఉప ఎన్నికల నోటిఫి కేషన్‌ మంగళవారం విడుదల కానున్నది. ఆ రోజు నుంచి మొదలయ్యే నామినేషన్ల స్వీక రణ పర్వం ఈ నెల 30 వరకు కొనసాగనున్న ది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే అభ్యర్ధు లను ప్రకటించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకుని వ్యూహా త్మకం గా ముందడుగు వేస్తున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఏడుగురు మంత్రు లు, ఏడుగురు శాసనసభ్యులతో ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సిద్ధం కాగా, అందుకు దీటుగా 85 మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలుగు దేశం పార్టీ ఎన్నికల నిర్వహణకు సన్నద్దమైం ది. ఇక భాజపా-జనసేన కూటమి అభ్యర్ధిని ప్రకటించే విషయంలో ఆలస్యం చేస్తున్న భాజపా నాయకత్వం దాదాపు 30 మంది రాజ్యసభ సభ్యులు, ఇతర సీనియర్‌ నేతలతో ఎన్నికల పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది.
2019 ఎన్నికలలో తిరుపతి లోక్‌సభ స్ధానంలో పోటీచేసి రికార్డు స్ధాయి మెజారిటీతో విజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావు అకాలమరణంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు, నాలుగు నెలలుగా రాజకీయపార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్‌ను గతవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిం ది. ఆ ప్రకారం ఈ నెల 23న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్నది. ఆ రోజు నుంచి ఈ నెల 30వరకు అభ్యర్ధుల నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. 31న నామినేషన్ల పరిశీలన గడువు ముగిశాక ఏప్రిల్‌ 3వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆపై ఏప్రిల్‌ 17న ఎన్నికలను నిర్వహించి మే నెల 2న ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ చక్రధరబాబు లోక్‌సభ ఉప ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు (చిత్తూరు జిల్లా), సుళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి (నెల్లూరు జిల్లా) శాసనసభ నియోజకవర్గాలు పరిధిగా కలిగిన తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ నామినేషన్ల స్వీకరణ నుంచి ఉపసంహరణల వరకు నెల్లూరు కలెక్టరేట్‌లోనే కొనసాగనున్నది. ఓట్ల లెక్కింపు మాత్రం రెండుజిల్లాల్లో కొనసాగనున్నది.
ఇక రాజకీయపార్టీల విషయానికి వస్తే, గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో ఆయన మరణించిన మరుసటి నెల నుంచే ఉప ఎన్నికల సందడి ఊపందుకుంది. ఆ దశలోనే 2019 ఎన్నికలలో తమ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయిన కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి అభ్యర్ధిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. మరోవైపు రాజకీ య అనుభవాలతో నిమిత్తం లేకుండా వైఎస్‌ కుటుంబానికి సన్ని హితుడైన యువ వైద్యుడు డాక్టర్‌ గురుమూర్తిని తమ అభ్యర్ధిగా వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమ అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా ఇటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియోజక వర్గాల నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఆ సందర్భంగా తమ అభ్యర్ధిని గెలిపించడానికి పూర్తిస్ధాయిలో కృషి చేస్తామని తెలుగుదేశం నాయకులు తమ అధినేతకు హామీలిచ్చారు. తమ పార్టీ అభ్యర్ధిని 3 లక్షలకు తక్కువ కానీ మెజారిటీతో గెలిపించుకుంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేసారు.
వందమంది సీనియర్లతో పర్యవేక్షణ కమిటీలు
అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా స్వీకరించాయి. సంబంధిత వ్యూహరచనలో భాగంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చూసే అసెంబ్లి నియోజకవర్గాల వారీ కమిటీ లలో దాదాపు వందమంది మంత్రులు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులకు స్ధానం లభించాయి. ఈ క్రమం లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు ఏడుగురు మంత్రులు ఏడుగురు శాసనసభ్యులతో ఏర్పాటైన కమిటీకి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. స్ధానిక మంగళం రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి గురుమూరి,్త పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతూ ప్రచార వ్యూహరచనలో నిమగ్నులవుతున్నారు. ఆ మంత్రుల, శాసనసభ్యుల కమిటీ నేతృత్వంలో ఈ వారంలో ప్రచార కార్యక్రమా లకు సన్నాహాలు మొదలయ్యాయి. అదేవిధంగా తమ పార్టీ తరపున తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లి నియోజక వర్గాలలో ఎన్నికల బాధ్యతలను నిర్వహించడానికి సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులతో పాటు 10 మంది శాసనసభ్యులు, 5 మంది శాసనమండలి సభ్యులందరితో కలిపి నియోజక వర్గాలవారీగా 85 మందితో ఏర్పాటు చేసిన కమిటీలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియమించారు. ఇప్పటికే స్దానిక రేణిగుంట రోడ్డులో లోక్‌సభ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన తెలుగుదేశం అధినేత పనబాక లక్ష్మి గత రెండురోజులుగా అసెంబ్లి నియోజకవర్గాల స్దాయి సమీక్షా సమావేశాలలో పాల్గొంటున్నారు. ఆమె ఈ నెల 24న నామినేషన్‌ను నెల్లూరులో దాఖలు చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తేలని భాజపా-జనసేన కూటమి అభ్యర్ధిత్వం
ఇక దాదాపు మూడు,నాలుగునెలల సందిగ్ధత అనంతరం ఇటీవలే ఆయా పార్టీల అధినాయకత్వాల సంయుక్త ప్రకటన చేయడం ద్వారా జనసేన పార్టీ మద్దతుతో భాజపా అభ్యర్ధి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తారనే అంశం స్పష్టమైంది. అభ్యర్దిత్వ ప్రకటన విషయంలో ఆ పార్టీ నాయకులు ముందువెనుకలాడుతు న్నా టికెట్టు రేసులో మూడు నాలుగు పేర్లు మాత్రం హల్‌చల్‌ చేస్తున్నాయి. అందులో విశ్రాంత ఐఎఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసు లు అభ్యర్ధిత్వం ప్రకటన లాంఛనమేన నే మాటతోపాటు మరో విశ్రాంత ఐఎఎస్‌ అధికారి రత్నప్రభ, విశ్రాంత ఐపిఎస్‌ అధికారి కృష్ణప్రసాద్‌ల పేర్లతో పాటు భాజపా నాయకులు మునిసుబ్రమణ్యం, శ్రీహరిరావు పేర్లు కూడా వినవస్తున్నాయి. అభ్యర్ధిత్వం ప్రకటించకు న్నా ఆదివారం 30 మంది రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్లతో భాజపా నాయకత్వం ఎన్నికల నిర్వాహక పర్యవేక్షణ కమిటీలను ప్రకటించింది. అయితే స్ధానికంగా జనసేన, భాజపా సంయుక్త సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం పట్ల ఆ రెండు పార్టీల కార్యకర్తలలో అసహనం వ్యక్తం అవుతోంది. ఒకటి రెండురోజుల్లో అభ్యర్దిని ప్రకటిస్తారని ఆ పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇతర పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారాన్ని మొదలెట్టడం ద్వారా కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ మరోమారు పోటీ చేయనున్నట్టు పరోక్షంగా ప్రకటించుకున్నారు. మరోవైపు సీపీఎం నాయకత్వం నెల్లూరు జిల్లాకు చెందిన నెల్లూరు యాదగిరిని అభ్యర్దిగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement