కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరుగనున్నాయి. ఇందుకోసం జూన్ 18వ తేదీ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. జూన్ 19న ఉదయం 10:45 నుంచి 11:15 గంటల మధ్య సింహ లగ్నంలో ధ్వజారోహణం జరుగనున్నది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.
జూన్ 22న సాయంత్రం 4 నుంచి 6:30 గంటల వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్ 27న ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం జరుగనుంది. అనంతరం ఉదయం 10 నుంచి 10:15 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.