Tuesday, November 26, 2024

దేశ చదరంగంలో తెలుగువాడు సత్తా చాటాలి… మంత్రి ఆర్కే రోజా

తిరుపతి సిటీ : దేశ చదరంగంలో తెలుగువాడు సత్తా చాటాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, క్రీడ, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. క్రీడాశాఖ మంత్రిగా ఉన్న ఈ జిల్లాకు ఇంత ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ రిలే రావడం గర్వకారణం అని, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని మంత్రి తెలిపారు. శనివారం స్థానిక శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుండి మహతి ఆడిటోరియం వరకు చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి, గ్రాండ్ మాస్టర్ అకాష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి, స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణి మోహన్, శాప్ ఎం.డి.ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, తిరుపతి నగరపాలక కమీషనర్ అనుపమ అంజలి, జె న్ అకాడమీ అధ్యక్షులు నూకతోటి రాజేష్, చెస్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు, వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఎన్.సి.సి, స్కౌట్ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని, మహతి ఆడిటోరియంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ర్యాలీ నిర్వహణ అనంతరం మహతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మన దేశంలోని 75 ప్రదేశాల్లో చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే తిరుపతి నగరంలో నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ జిల్లాకు చెందిన వ్యక్తినైన తాను క్రీడా శాఖ మంత్రిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ కు మొట్ట మొదటిసారిగా మన దేశం ఆతిథ్యం ఇవ్వబోతుందని, ఈనెల 29వ తేదీ నుండి ఆగష్టు 9 వరకు తమిళనాడులోని మహాబలిపురంలో ఈ చెస్ ఒలింపియాడ్ జరగనున్నదని, ఇందుకు కారణమైన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తక్కిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్న ఎన్.సి.సి. ఆంధ్ర 29 బెటాలియన్ కల్నల్ సోమన్ అధికారి, తిరుపతి, చిత్తూరు జిల్లాల క్రీడా ప్రాధికార సంస్థల ప్రతినిధులను, అతిధులను ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement