తిరుపతి, కోడూరుల నుంచి జాయింట్ ఆపరేషన్
మూడు రోజుల పాటు అడవుల్లో కూంబింగ్
తెల్లారాళ్లకుప్ప వద్ద స్మగ్లర్లు కోసం వంట చేస్తున్న ఆళ్లగడ్డ వ్యక్తి అరెస్ట్
శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు కదలికలు పసిగట్టేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మూడు రోజులు పాటు కూంబింగ్ చేపట్టారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ రాత్రి వరకు తిరుపతి నుంచి ఆర్ ఐ భాస్కర్, కోడూరు నుంచి ఆర్ ఐ కృపానంద టీమ్ లు అటవీశాఖ తో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాలు మేరకు డీఎస్పీ లు గిరిధర్, మురళీధర్ ల నేతృత్వంలో ఈ ఆపరేషన్ లు జరిగాయి. ఆపరేషన్ డీఎస్పీ మురళీధర్ రూట్ మేప్ రూపొందించి రెండు టీమ్ లను మోనిటర్ చేశారు. ఆర్ ఐ భాస్కర్ టీమ్ లో ఆర్ ఎస్ ఐ లు వాసు, సురేష్ లతో పాటు 16 మంది వెళ్లారు. వీరు అన్నదమ్ముల బండ నుంచి జొన్నరాతికుప్ప మీదుగా మొగిలి కుప్ప, గుండాల కోన, ఆర్బుతాల గుట్ట, బూగ్గవాగు వరకు కూంబింగ్ చేపట్టారు. అక్కడ నుంచి తెల్లారాళ్లకుప్ప వైపు రాగా అక్కడ ఒక వ్యక్తి వంట చేస్తూ కనిపించాడు. అతన్ని ఆరా తీయగా స్మగ్లర్లు కోసం వంట చేస్తున్నట్లు చెప్పాడు. తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన కాశిం వల్లి అని తనతో పాటు మరో ముగ్గురు ఉన్నారని తెలిపాడు. యర్రావారిపాలెంకు చెందిన మరో నలుగురు, మొత్తం ఎనిమిది మందికి వంట చేయడానికి తీసుకుని వచ్చినట్లు తెలుపగా, అతన్ని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలించేందుకు ఒక టీమ్ ను అడవిలోకి పంపినట్లు ఆర్ ఐ భాస్కర్ తెలిపారు. అదేవిధంగా రైల్వే కోడూరు నుంచి ఆర్ ఐ కృపానంద తో పాటు ఆర్ ఎస్ ఐ లక్ష్మణ్ సహా 15 మంది కూంబింగ్ చేపట్టారు. వీరు కన్నేమడుగు, సిద్దివేడు తదితర ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. మూడు రోజులు పాటు కొండలు, గుట్టలు ఎక్కి దిగారు. దట్టమైన అడవుల్లో పాములు, విష కీటకాలు, జంతువులను తప్పించు కుంటూ స్మగ్లర్లు ఆచూకీ కోసం గాలించారు. కరోనా సమస్యతో స్మగ్లర్లు ఎర్రచందనం కోసం రాక పోయి ఉండవచ్చు నని భావిస్తున్నారు. మూడు రోజులు పాటు ప్రత్యేక టాస్క్ గా భావించి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు డీఎస్పీలు తెలిపారు. స్మగ్లర్లు అడవుల్లోకి ప్రవేశిస్తే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.