తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు సంప్రదాయం ప్రకారం వారికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తితిదే అధికారులు వారికి స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
మరోవైపు ఈరోజు మధ్యాహ్నం జస్టిస్ రమణ హైదరాబాద్‌కు రానున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తుండడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జస్టిస్ రమణకు మంత్రి కేటీఆర్ స్వాగతం పలకనున్నారు. మూడు రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో జస్టిస్ రమణ బస చేస్తారు. ప్రజల నుంచి విజ్ఞప్తులూ స్వీకరించే అవకాశం ఉంది.