Tuesday, November 26, 2024

తిరుమ‌ల‌లో శ్రీవారి పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శనమిస్తారు. ఉత్సవాల్లో మొదటి రోజైన సోమవారం పవిత్రాల ప్రతిష్ట, 9న పవిత్ర సమర్పణ, 10న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా.. పవిత్రోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్జితసేవలను రద్దు చేసింది. మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణసేవలతో పాటు 9న శ్రీవారి ప్రధాన ఆలయంలో జరిగే అష్టదళపాదపద్మారాధన కార్యక్రమాన్ని సైతం రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement