తిరుమల : సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్ లో జూన్ 27న టీటీడీ విడుదల చేయనుంది. మొత్తం 46,470 టిక్కెట్‌లలో, లక్కీ డిప్ సేవా టిక్కెట్లు 8070 ఉన్నాయి. అదేవిధంగా ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు ఉన్నాయి. ఆర్జిత సేవలైన సుప్రబాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన టిక్కెట్లు లక్కీ డిప్‌లో కేటాయించబడతాయి. దీని కోసం భక్తులు జూన్ 27 ఉదయం 10 నుండి జూన్ 29 ఉదయం 10 గంటల మధ్య ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
ఆన్‌లైన్ లక్కీ డిప్ డ్రా తర్వాత టిక్కెట్‌ల నిర్ధారణ చేయబడుతుంది. కేటాయించిన టిక్కెట్ల జాబితా జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. టికెట్లు పొందిన గృహస్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ సేవా టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు జూన్ 29న సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి. వీటిని ముందుగా వచ్చిన ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయించబడుతుంది. భక్తులు తమ సేవా టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ఈ మార్గదర్శకాలను గమనించి పొందాలని టిటిడి కోరుతున్నది.