తిరుపతి, (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) దేశవ్యాప్తం పట్టుబడిన ఎర్ర చందనం దుంగలను రాష్ట్రానికి తీసుకు రావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని, అలా తెచ్చిన దుంగలను విక్రయించి వచ్చే సొమ్ములో ఆయా రాష్ట్రాలకు వాటా ఇస్తామని
రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. స్థానిక కరకంబాడి రోడ్డులోని ప్రైవేటు హోటల్లో ఈ రోజు సాయంత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ పై అనుసరించాల్సిన వ్యూహలపై వివిధ రాష్ట్రాల అటవీ శాఖ పి. సి.సి.ఎఫ్ లతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఎర్ర చందనం శేషాచలం అడవుల్లో మాత్రమే ఉందన్నారు. దేశంలో ఎక్కడ ఎర్ర చందనం పట్టుబడిన ఒకే ప్రాంతంకు సంబందించినదేనని చెబుతూ ఆ ఎర్రచందనాన్ని ఏపికి తీసుకువచ్చే విధంగా చర్యలు చెప్పాడుతున్నామని అన్నారు. ఆయా ప్రాంతంలో పట్టుబడిన దుంగలను రాష్ట్రానికి తెప్పించి వేలం వేస్తామన్నారు, తద్వారా వచ్చే ఆదాయంలో ఆయా రాష్ట్రలకు వాటా ఇస్తామని చెప్పారు. రాష్ట్రాలకు కస్టమ్స్, డి.ఆర్.ఐ లకు వాటా ఉంటుందని, తద్వారా ఎర్ర చందనం ద్వారా రాష్ట్రానికి ఆర్థికంగా మరింత ప్రయోజనం, ఆదాయం లభిస్తుందని అన్నారు.
ఈ కార్యకలాపాలను ఒక నోడల్ ఏజెన్సీ కిందకు తీసుకు వచ్చేలా చర్యలు చేపట్ట డానికి ఒక కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ స్పెషల్ సెక్రటరీ చంద్ర ప్రకాష్ గోయల్ పాల్గొన్న సమావేశంలో ఎర్రచందనం పరిరక్షణకు తీసుకోవాల్సినచర్యలు, మార్గదర్శకాలు పై చర్చించారు.