తిరుపతి సిటీ, మే 2 (ప్రభ న్యూస్) : బాల్య వివాహాలను అరికట్టాలని, అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని మహిళా పోలీసులకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. మంగళవారం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జిల్లావ్యాప్తంగా మహిళా పోలీసులతో వారి పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మిరెడ్డి మాట్లాడుతూ.. పోలీసుల పనితీరుపై సబ్ డివిజన్ వారీగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని వివరించారు. మహిళా పోలీసుల పరిధిలో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. నేరానికి సంబంధించి ముందు సమాచారాన్ని సేకరించి ఆ గ్రామ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల పై ఎస్ .హెచ్. ఓ. దృష్టికి సమాచారాన్ని తీసుకుని వచ్చి నేర నివారణలో భాగస్వాములు కావాలని తెలియజేశారు. నేటితరం పోలీస్ కానిస్టేబుల్ వద్ద అపారమైన జ్ఞానం, తెలివితేటలు ఉన్నాయని, వారి తెలివితేటలను పూర్తిగా ఉపయోగించుకుని, బీట్ వ్యవస్థను దర్యాప్తు చేసే పద్ధతిలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మహిళా పోలీసుల సేవలు శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేయాలని తెలిపారు. అలాగే మహిళా పోలీసులు వారి వారి పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో సమావేశమై ఎల్. హెచ్. ఎం. ఎస్. తో పాటు సైబర్ సెక్యూరిటీ, దిశా యాప్, మొబైల్ హంట్ అప్లికేషన్, సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
అదేవిధంగా గృహహింస, వరకట్నం, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్, సామాజిక దురాచారాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని తెలియజేశారు. అంగన్వాడీ, పాఠశాలలు కళాశాలలో హాస్టల్లో సందర్శించి నేటి సమాజంలో మహిళలపై ఎక్కువగా జరుగుతున్న నేరాలైన గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఫోక్సో చట్టం, ప్రేమ వలయాల్లో పడి పారిపోవడం, సోషల్ మీడియా మోసాలపై రహదారిలో భద్రత, వీటన్నింటిపై కనీస అవగాహన కార్యక్రమం ఉండేవిధంగా మహిళా పోలీసులు చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ప్రతినెలా నేర సమీక్ష సమావేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసులకు తగిన అవార్డులు, రివార్డులతో పాటు ప్రోత్సాహాలను కూడా అందించడంతో పాటు అభినందించడం జరుగుతుందన్నారు. అనంతరం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వేసవి సెలవుల కారణంగా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇటీవల కాలంలో నిరుద్యోగ యువత ఎక్కువగా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆ తర్వాత నేర ప్రవృత్తికి అలవాటు పడటంతో పాటు చెడు వ్యసనాలకు బానిసవుతూ ఉంటారన్నారు. అలాంటి యువకులను గుర్తించి ఎస్.హెచ్.ఓ. లు కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అదరపు ఎస్పీ కులశేఖర్, క్రైమ్ అదనపు ఎస్పీ విమల కుమారి, దిశ పోలీస్ డీఎస్పీ రామరాజు, డీఎస్పీలు సురేందర్ రెడ్డి, నరసప్ప, సీఐలు రామకృష్ణ చారి, సురేందర్ రెడ్డి, రవీంద్రనాథ్, జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా పోలీసులు పాల్గొన్నారు.