తిరుమల శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను నిత్య నైవేద్యంగా శనివారం నుండి పునః ప్రారంభించినట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ గోవిందుడికి గో ఆధారిత ప్రకృతి నైవేద్యం సమర్పించే సాంప్రదాయం దాదాపు 100 సంవత్సరాల క్రితం వరకు ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, కూరగాయలు, అరటిపండ్లు, బెల్లం, దేశీయ ఆవు నెయ్యితో తయారుచేసిన అన్నప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా పూర్వ వైభవాన్ని తెచ్చామన్నారు. భక్తులు ప్రతి రోజు స్వీకరించే ప్రసాదానికి ఈ ప్రసాదానికి రుచిలో చాలా తేడా ఉన్నట్లు చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో ఆలయంలో శాశ్వతంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన వంట సరుకులతో నైవేద్యం సమర్పించనున్నట్లు ఛైర్మన్ వివరించారు.
అదేవిధంగా శనగలు, బెల్లంతో లడ్డూ ప్రసాదం తయారు చేసినట్లు తెలిపారు. దీనిపై అధికారులతో సమీక్షించి సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను గుర్తించి, వారి నుండి నేరుగా సేకరించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు.
టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ శివకుమార్, శ్రీ శేఖర్‌రెడ్డి, డా.నిశ్చిత, కృష్ణా జిల్లా పినగూడురు లంకకు చెందిన రైతు శ్రీ విజయరామ్ ఛైర్మన్ వెంట ఉన్నారు.
గోవిందుడికి గో ఆధారిత ప్రకృతి నైవేద్యం : టిటిడి ఛైర్మన్
Advertisement
తాజా వార్తలు
Advertisement