Thursday, November 21, 2024

తిరుపతి కోర్టుకు హాజ‌రైన‌ మోహన్‌బాబు.. 2019లో ఎన్నిక‌ల కోడ్ ధిక్క‌ర‌ణ‌ కేసుపై విచార‌ణ‌!

తిరుపతి, ప్రభన్యూస్‌ బ్యూరో (రాయలసీమ) : 2019లో అనుమతిలేకుండా రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించిన కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం ప్రముఖ సినీనటుడు, విద్యానికేతన్‌ విద్యాసంస్ధల అధినేత మోహన్‌బాబు మంగళవారం స్దానిక కోర్టుకు హాజరయ్యారు. ఆయన వెంట మా అధ్యక్షుడు మంచు విష్ణు, నటుడు మనోజ్‌కుమార్‌ పెద్ద సంఖ్యలో అభిమానులు, విద్యార్దులు తరలివచ్చారు. కాగా ఈ కేసు విచారణను వచ్చే సెప్టెంబర్‌ 30వ తేదికి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్దానం ప్రకటించింది. 2019 మార్చి 22న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ మోహన్‌బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌, విద్యాసంస్ధల పరిపాలనాధికారి తులసీనాయుడు, పిఆర్‌ఓ సతీష్‌ తదితరులతో కలిసి తిరుపతి – మదనపల్లె రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

అప్పుడు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున కోడ్‌ ఉల్లంఘించారని, అనుమతిలేకుండా నిరసన కార్యక్రమం చేపట్టారని, వాహనదారులకు ఇబ్బంది కలిగించారనే ఆరోపణలపై చంద్రగిరి పోలీసులు వారిపై 341, 171(ఎఫ్‌), పోలీసు యాక్ట్‌ 290 కింద వారిపై కేసులు నమోదు చేసారు. ఆ కేసు విచారణలో భాగంగా మంగళవారం మోహన్‌బాబు, కుమారులు విష్ణు, మనోజ్‌ లతో కలిసి స్ధానిక కోర్టుకు హాజరయ్యారు. సమీపంలోని ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ వద్ద నుంచి కాలినడకన కోర్డు వద్దకు చరుకున్నారు. దీంతో మోహన్‌బాబు అభిమానులు, విద్యాసంస్ధ విద్యార్దులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కోర్టు ప్రాంగణం క్రిక్కిరిసి పోయింది. బిజెపి నాయకుడు కోలా ఆనంద్‌తో పాటు కొందరు వైసిపి నాయకులు కోర్టు ఆవరణకు వచ్చి మోహన్‌బాబుకు సంఘీభావం తెలిపారు. కాగా న్యాయస్ధానం కేసును సెప్టెంబర్‌ 30వ తేదికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కోర్టు వద్ద మోహన్‌బాబు మీడియాతోమాట్లాడుతూ ”సమన్లు రాకున్నా న్యాయమూర్తి పిలిచారని కోర్డుకు వచ్చాను. న్యాయమూర్తి సమక్షంలో సమన్ల పేపర్‌పై సంతకం పెట్టాను. విచారణ వాయిదా వేసారు. ఇంతకుమించి ఏం మాట్లాడినా తప్పు అవుతుంది. ” అని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement