Monday, October 21, 2024

AP | తిరుపతిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు

  • 17 ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
  • నగరాన్ని ఏడు సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్ కు వాహనాలు కేటాయింపు
  • పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా వీరి పనితీరును పర్యవేక్షణ
    తిరుపతి ప్రతినిధి (తిరుపతి): నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించి, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలనే ముఖ్య ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం తిరుపతి నగరంలో ఇప్పటికే విధులలో ఉన్న 17 ద్విచక్ర వాహనాలకు అదనంగా జిపిఎస్ సిస్టం, సైరన్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, ఫ్లాష్ లైట్, బ్రీత్ అనలైజర్ వంటి పరికరాలు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన వాహనాలను సోమవారం తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఈ వాహనాలన్నీ తిరుపతి ట్రాఫిక్ నియంత్రణ కోసం విధుల్లో ఉన్నాయని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికంగా తీర్చిదిద్ది, పునః ప్రారంభించామన్నారు. నగరాన్ని ఏడు సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్ కు ఈ వాహనాలను ట్రాఫిక్ పోలీసులను కేటాయించినట్లు చెప్పారు. వారు నిరంతరం తిరుగుతూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వాహనాల ఫోటోలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి పంపించి, జరిమానాలు విధించేటట్లు చేస్తారన్నారు.

తిరుపతి నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏర్పాటు చేసిన వన్-వే లు, ఫుట్ పాత్ ఆక్రమణలు, రాంగ్ పార్కింగ్ లు వీటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామని, ప్రజల్లో పూర్తిస్థాయి చైతన్యం కల్పిస్తూ తిరుపతికి వచ్చే యాత్రికులకు, స్థానికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తారన్నారు. ఈ వాహనాలన్నిటికీ జీపీఎస్ సిస్టం అమర్చి పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి వారి కదలికలపై కూడా నిరంతరం ఉన్నతాధికారులు నిఘా ఉంచనున్నట్లు చెప్పారు. అలాగే ఏదైనా అనుకోని ఘటనలు సంభవించినప్పుడు వారిని కంట్రోల్ రూమ్ ద్వారా అప్రమత్తం చేసి ప్రజలకు మంచి సేవలు అందిస్తామన్నారు.

- Advertisement -

ప్రజల్లో చైతన్యం ద్వారా రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని ఎస్పీ అన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కూడా వీరు నిఘా పెడతారని, అవసరమైన సమయంలో బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్టులు నిర్వహించి, కోర్టులో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, శ్రీనివాసరావు, డీఎస్పీ గిరిధర, తిరుపతి ట్రాఫిక్ సిఐలు రవీంద్ర, సంజీవ్ కుమార్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement