Thursday, November 21, 2024

తిరుమలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు : టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, ప్రభన్యూస్‌ : గ్లోబల్‌ వార్మింగ్‌ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యమౌతుందని టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తె లిపారు. ఈ సందర్భంగ గత మూడేళ్ళలో టిటిడి ఆద్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న అనేక నిర్ణయాల గురించి వివరించారు. శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల క్షేత్రాన్ని కాలుష్య రహిత క్షేత్రం తీర్చి దిద్దడానికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా తిరుమలలో ప్లాస్టిక్‌ వాడాకాన్ని పూర్తిగా నిషేదించామన్నారు. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ళ అమ్మకాన్ని రెెండేళ్ళ కిందటే నిషేదించామని చెప్పారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా గాజుబాటిళ్ళు ఏర్పాటు చేయించడంతో పాటు తిరుమలలోని అన్ని ప్రాంతాలు, అతిథి గృహాల్లో జలప్రసాదం అందుబాటులో ఉంచి భక్తులకు సురక్షిత తాగునీరు అందిస్తున్నామన్నారు. చైర్మెన్‌ నుంచి సామాన్య భక్తుడి వరకు ఈ నీ రే తాగుతున్నారని తెలిపారు. ఈనెల 1 వ తేది నుంచి కొండ పై హోటళ్ళు, ఇతర దుకాణాల్లో ఏ రూపంలో కూడా ప్లాస్టిక్‌ వాడరాదని ఆదేశాలు జారి చేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా అలిపిరి టోల్‌గేట్‌ వద్ద విజిలెన్స్‌ సిబ్బంది తనిఖీలు చేసి వాటర్‌ బాటిళ్ళు తీసేస్తున్నారన్నారు. భక్తులు కూడా ఇందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తిరుమలో విద్యుత్‌ వాహనాల వినియోగం ప్రారంభించామని, త్వరలోనే ఆర్టిసి 100 విద్యుత్‌ బస్సులు నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లు తిరుమలకు విద్యుత్‌ వాహనాలను మాత్రమే అనుమతించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. శ్రీవారి ప్రసాదాల కౌంటర్లలలో ప్లాస్టిక్‌ బ్యాగులు నిషేదించామని, వీటి స్థానంలో జూట్‌, పర్యావరణానికి హాని కలిగించని బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. తిరుమలకు వస్తున్న భక్తులకు ఆహ్లాదం, ఆధ్యాత్మిక వాతావరణం, పర్యావరణ పరిరక్షణ చర్యలు పెంపొందించే విధంగా ఉద్యానవనాలను అభివృద్ది చేస్తున్నాము. నేలతల్లిని కాపాడుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా రైతులు రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేయడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో రైతు సాధికార సంస్థతో ఒప్పొందం చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పండించిన శెనగలు, బియ్యం, బెల్లం టిటిడిని కొనుగోలు చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యావరణహిత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని చైర్మెన్‌ తెలిపారు. తిరుమలలో 10 వేల మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు నేలతల్లిని, నీటిని, గాలిని కలుషితం చేయకుండా కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించి సమాజ భవిష్యత్తుకు పాటుపడాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement