తిరుమల : తిరుమలలోని దుకాణదారులు, హాకర్లు, బాలాజి నగర్‌లోని అద్దెదారులు జూన్ 30వ తేదీలోపు లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని, అదేవిధంగా వారసులు/కొనుగోలుచేసిన వారు(పర్చేజర్లు) లైసెన్సులు బదిలీ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు టీటీడీ రెవెన్యూ విభాగం సూచించిన పత్రాలను జతపరిచి సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 30వ తేదీ తరువాత వచ్చే విజ్ఞప్తులు స్వీకరించబడవు. గడువులోపు లైసెన్సులు రెన్యువల్ గానీ, బదిలీ గానీ చేసుకోని పక్షంలో అలాంటి దుకాణాలను ఆక్రమణలుగా భావించి లైసెన్సులు రద్దు చేసి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఒరిజినల్ లైసెన్సుదారులు, లైసెన్సుదారుల వారసులు, ఒరిజినల్ లైసెన్సులు గల దుకాణాలు కొనుగోలు చేసినవారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని టీటీడీ సూచించింది.