తిరుమల పరిసర ప్రాంతాలలో ఇటీవల చిరుతల సంచారం తరచుగా వెలుగులోకి వస్తోంది. శుక్రవారం సైతం తిరుమలలోని రెండు ప్రదేశాల్లో చిరుతపులి కనిపించింది. సెకండ్ ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం వద్ద ఓ వాహనాన్ని చిరుతపులి దాటుకుంటూ వెళ్లింది. ఆకస్మాత్తుగా చిరుత కనిపించడంతో భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. అప్పటివరకు తిరుమల పరిసరాల అందాలను తమ సెల్‌ఫోన్లలో బంధిస్తున్న భక్తులు ఒక్కసారిగా సెల్‌ఫోన్లు బంద్ చేసి వాహనాల విండోస్‌ను బంద్ చేసుకున్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
మరోవైపు శుక్రవారం ఉదయం తిరుమల సన్నిదానం గెస్ట్‌హౌస్ వద్ద చిరుతపులి సంచరించింది. సన్నిదానం సమీపంలోని రెస్టారెంట్ వద్ద పందులను వేటాడేందుకు చిరుత వచ్చినట్లుగా తెలుస్తోంది. రెస్టారెంట్ సిబ్బంది గమనించడంతో అది పారిపోయింది. సన్నిదానం గెస్ట్‌హౌస్ వద్ద తరచుగా చిరుతపులి కనిపిస్తుందని భక్తులు, టీటీడీ సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య