Saturday, November 23, 2024

వైభవంగా కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి : జెఈవో వీరబ్రహ్మం

తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 11వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, ఫిబ్రవరి 19వ తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చంద్రగిరి, తిరుపతిలలో బ్రహ్మోత్సవాల కటౌట్లు ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ప్రజాసంబంధాల అధికారికి సూచించారు. ఆలయ ప్రాశస్యము తెలిసేలా ఎస్విబిసిలో ప్రోమో ప్రసారం చేయాలని అధికారులకు సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన గరుడసేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహారం శోభాయాత్ర, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటుచేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి ప్రసాదం కౌంటర్లను పెంచాలన్నారు. మొబైల్‌ మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ద్య కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్‌ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టిటిడి విజిలెన్స్‌ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement