తిరుపతి – చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది… ఎపిలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాగా చిత్తూరు ఉండటం కలవరం కలగిస్తున్నది… నిన్న ఒక్క రోజే చిత్తూరు జిల్లాలో రికార్డ్ స్థాయిలో 496 కేసులు నమోదయ్యాయి.. అలాగే ఇద్దరు మరణించారు… ఒక వైపు ఈ జిల్లాలోని తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 17న జరగనుంది.. ఈ ఎన్నికలను టిడిపి, వైసిపి, బిజెపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.. ఈ స్థానం అటు చిత్తూరు, ఇటు నెల్లూరు జిల్లాల పరిధిలో ఉంది.. నెల్లూరులో సైతం నిన్న ఒక్క రోజే 292 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు.. ఈ రెండు జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఈ నెల 14వ తేదిన వైసిపి నిర్వహించనున్న జగన్ ప్రచార సభను రద్దు చేశారు.. ఈ మేరకు జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 14వ తేదిన తిరుపతిలో జరగాల్సిన తన ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.. తన ప్రచారం సభలకు వేలల్లో ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రచారంలో పాల్గొనడం లేదని పేర్కొన్నారు..అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.. రేపటి నుంచి ఎపిలో ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో అర్హులైన వారందరూ పాల్గొని కొవిడ్ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.. కాగా, తిరుపతి ఉప ఎన్నికలలో వైసిపి అభ్యర్ధి గురుమూర్తికి ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ జగన్ సంతకంతో కూడిన లేఖను ఆ పార్టీ విడుదల చేసింది.. ఈ లేఖను తిరుపతి ఓటర్లుకు వైసిపి కార్యకర్తలు అందించనున్నారు.