Tuesday, November 26, 2024

అంతర్రాష్ట్ర ఎర్ర స్మగ్లర్ అరెస్ట్ – 18 దుంగలు, 2 వాహనాలు  స్వాధీనం 

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి ) : ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర  స్మగ్లర్ తో పాటు వాంటెడ్ స్మగ్లర్ మేఘవర్ణంలను అరెస్టు చేసినట్లు ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్సు ఎస్పీ ఎస్ కే చక్రవర్తి తెలిపారు. సోమవారం  టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…  సీఐ రామకృష్ణ టీమ్ తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, టీఎన్ పాలెం సెక్షన్ కరకంబాడి ఫారెస్ట్ బీట్ పరిధిలోని శ్రీకాళహస్తి-రేణిగుంట రోడ్డులో వాహనాలను తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. ఉదయం 8గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి వైపు నుంచి కారు, లారీ వస్తూ కనిపించాయి. వారిని నిలిపి ప్రశ్నిస్తుండ‌గా అందులోనుంచి కొందరు బయటకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు.

వారిలో ఇద్దరినీ టాస్క్ ఫోర్స్  సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరైన మురుగన్ (40) తమిళనాడు తిరువళ్లూరుజిల్లా సోలవరంకు చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ అని, అతనిపై టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ పరిధిలో ఆరు కేసులు ఉన్నాయని తెలిపారు. కాగా పట్టుబడిన మరొకరు మేఘవర్ణం (60) దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడుగా గుర్తించారు. మురుగన్ కు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చక్రవర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.  వీరిద్దరి నుంచి ఒక ఎయిచర్ ఒక స్విఫ్ట్ వాహనాలను, 18ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని,  వీటి విలువ రూ.50లక్షలు ఉంటుందని తెలిపారు. టీమ్ లో పాల్గొన్న సిబ్బందికి ఎస్పీ రివార్డులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement