Tuesday, November 26, 2024

పారాయణాలతో సమాజంలో ధార్మిక విలువలు పెంపు : కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర

తిరుమల: రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల పారాయణం వల్ల సమాజంలో ధార్మిక విలువలు పెంపొందుతాయని, ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న టిటిడిని అభినందిస్తున్నానని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఉద్ఘాటించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం జరిగిన అయోధ్యకాండ పారాయణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ఇతిహాసాలు మానవ జాతి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి శాశ్వత మార్గదర్శకాలన్నారు. కోవిడ్ మహమ్మారి నుండి మానవాళిని రక్షించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ పారాయణ యజ్ఞాన్ని ప్రారంభించి మూడు సంవత్సరాలుగా టిటిడి విజయవంతంగా నిర్వహిస్తోందని కొనియాడారు. పారాయణాల ద్వారా ఇతిహాసాల సారాన్ని ప్రపంచానికి అందించాలని ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. రామాయణంలోని పాత్రలు ఆదర్శనీయంగా నిలుస్తాయని, తండ్రి ప్రేమకు చిహ్నంగా దశరథుడు, శ్రీరాముడు తండ్రి మాటను శిరసావహించే కుమారుడిగా, సీత బాధ్యతాయుతమైన భార్యగా, లక్ష్మణుడు, భరతులు సోదరప్రేమకు ప్రతీకగా, హనుమంతుడిని గొప్ప సేవకునిగా అభివర్ణించారు. రామాయణ, మహాభారతాలు అనేక యుగాల తర్వాత కూడా అజరామరంగా ఉండటానికి ఇదే కారణమన్నారు. ముందుగా ఈవో ఎ.వి.ధర్మా రెడ్డి మాట్లాడుతూ.. సుందరకాండ, బాలకాండను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత 4 వేలకుపైగా శ్లోకాలు గల అయోధ్యాకాండను ప్రారంభించామన్నారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి రాణి సదాశివమూర్తి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కుప్పా విశ్వనాథ శర్మ, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కేఎస్‌ఎస్.అవధాని తదితరులు మాట్లాడారు. పారాయణం ప్రారంభానికి ముందు, టీటీడీ ఆస్థాన విద్వాంసులు డాక్టర్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ బృందం “శరణు శరణు నీకు.. జగదేక వందిత” అన్నమాచార్య సంకీర్తనను రాగయుక్తంగా ఆలపించారు. ధర్మగిరికి చెందిన ప్రఖ్యాత పండితులు రామానుజాచార్యులు ప్రతి శ్లోకం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. అనంత వేణుగోపాల్ శ్లోక పారాయణం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 7 నుండి 8 గంటల మధ్య ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డా.విభీషణ శర్మ తదితరులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement