చిత్తూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారికోసం చిత్తూరు జిల్లా పోలీసులు విలక్షణమైన సేవకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఛాట్ బాట్ ( CHAT BOT) పేరుతో ఏర్పాటు చేసిన ఆ సేవను చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిషాంత్ రెడ్డి ప్రారంభించారు. పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చిత్తూరు జిల్లా పరిధిలో చోరీ / మిస్ అయిన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరుగుతుంది.
పోగొట్టుకున్న బాధితులు తమ వివరాలు పంపవలసిన విధానం ఏమిటంటే .. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440900004 నంబర్ వాట్సాప్ కు HI, లేదా Help అని పంపాలి… తర్వాత వెనువెంటనే Welcome to Chittoor Police పేరున ఒక లింకు HI లేదా HELP అని పంపిన మొబైల్ కు వస్తుంది… ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. డిస్ట్రిక్ట్, పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్ నంబర్, మిస్సయిన మొబైల్ మోడల్, IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ వివరాలను సబ్మిట్ చేసిన వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది. ఈ సేవలను వినియోగించుకోవాలని, ఫోన్ చోరీకి గురయినా… మిస్ అయినా వెంటనే వాట్సాప్ మెసేజీ పంపాలని జిల్లా ఎస్పీ చిత్తూరు జిల్లా ప్రజలను కోరుతున్నారు.