Tuesday, November 26, 2024

Tirumala : కపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలు ప్రారంభం

తిరుపతి : లోక కళ్యాణార్థం తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం హోమ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. జనవరి 16 నుంచి 21వ తేదీ వరకు ఆరు రోజులపాటు ప్రత్యేక హోమ మహోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. గ‌ణ‌ప‌తి పూజతో హోమ మహోత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి. పుణ్యాహవాచనం, దేవతా అనుజ్ఞ, మహాగణపతి కలశ స్థాపన, మహాగణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జనవరి 17వ తేదీ శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం, జనవరి 18న శ్రీ దుర్గ, శ్రీ లక్ష్మీ, శ్రీ సరస్వతి అమ్మవార్ల హోమం, జనవరి 19న శ్రీ నవగ్రహ హోమం నిర్వహిస్తారు. జనవరి 20న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, జనవరి 21న శ్రీ రుద్ర , శ్రీ మృత్యుంజయ స్వామి వారి హోమాలు నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు నిర్వహిస్తున్న హోమ మహోత్సవాల్లో చైర్మన్ దంపతులతో పాటు, సివిఎస్వో నరసింహ కిషోర్, డిప్యూటి ఈవో దేవేంద్ర బాబు, ఎఈవో పార్థ సారధి పాల్గొన్నారు.

కన్నుల పండువగా గోదా కల్యాణం

తిరుపతి : టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది. ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం అలరించింది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవింద గోవిందయని కొలువరే సంకీర్తన ఆలపించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆతరువాత మహా సంకల్పం, స్వామి,అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరించి గోదా కల్యాణం విశిష్టతను వివరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు సంకీర్తనలు వీనుల విందుగా ఆలపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement