కుప్పం (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : తాను ప్రజల్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తానే.. కానీ దొంగ ఓట్లను నమ్ముకుని కాదని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ రోజు కుప్పం రూరల్ మండలంలో రెండో రోజు చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ. తన నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించడాన్ని ప్రస్థావిస్తూ ఉంటే ఎవరైనా వెంటనే తొలగించుకోవచ్చునన్నారు.
ఎవరు దొంగ ఓట్లతో గెలిచారో ప్రజలకు తెలుసునని, చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పంలో 12 వేల దొంగ ఓట్లు ఇప్పటి వరకు తొలగించామని, ఇంకా 26వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించామని చెప్పారు. ఆరోగ్య శ్రీ అంటేనే వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తొస్తారని, అమ్మఒడి, ఆసరా అనగానే సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తొస్తారని అంటూ ఆ విధంగా చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. నాడు జన్మభూమి కమిటీలు అర్హులను పట్టించుకున్న పరిస్థితి లేదని, నేడు సీఎం వైఎస్ జగన్ అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తున్నారన్నారు.
కుప్పం కు హంద్రీ నీవా పథకం ద్వారా నీళ్లు మరో నెలరోజుల్లో అందుతాయన్నారు. కుప్పం రూరల్ ప్రాంతంలో తొలిరోజు పది పంచాయతీల పరిధిలో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించిన మంత్రి రెండో రోజు మరో 10 పంచాయితీల పరిధిలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపి ఎన్ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ లు భరత్, సిపాయి సుబ్రమణ్యం, టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.