తిరుపతి సిటీ : తిరుపతి జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని 20 మందిని అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ, పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా పరిధిలో గంజాయి రవాణా, విక్రయించే ప్రాంతాలు గంజాయి సేవించే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. గంజాయి రవాణా విక్రయించే 20 మంది అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండిగ రోడ్డుకి ఆనుకుని ఉన్న రామచంద్ర మిషన్ వద్ద 9 లక్షల రూపాయలు విలువ గలిగిన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి తిరుపతిలో 8 సంవత్సరాల క్రితం జీప్ డ్రైవర్ గా ఉంటూ చాలా మందితో పరిచయాలు కలిగి ఉండి, గతంలో ఒకసారి తొట్టంబేడు పోలీస్ స్టేషన్ లో ఎర్రచందనం కేసులో కూడా అరెస్టు కాబడి అతనిపై అతనికి ఉన్న పరిచయాలతో, శ్రీకాళహస్తి వెంకటగిరి, రేణిగుంట, చిత్తూరు, తిరుపతి నగరం చెన్నై, కర్ణాటకలోని కోలార్ తదితర ప్రాంతాలలో చాలా మందితో పరిచయం పెట్టుకుని వారికి గంజాయి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని తెలియజేశారు.
ఇతను విశాఖ పట్టణం ఇతర పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున గంజాయిని తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా బస్సులో ప్రయాణం చేసి, గంజాయిని శ్రీకాళహస్తికి తీసుకురావడం జరుగుతున్నది అన్నారు. ఇతను అరుకు, నుంచి గంజాయిని తెప్పించుకుని పరిసర ప్రాంతాల సరఫరా చేస్తున్నాడు. అలాగే ఇతర రాష్ట్రాలు చెన్నై, కేరళ కూడా పంపిస్తున్నారని ఇతని ద్వారా దీనిలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకోవడం జరిగిందన్నారు. పాత నేరస్థులు కూడా ఉన్నారని వీరుపై పిడి యాక్ట్, ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లాకు చెందిన 17 మంది పురుషులు, ముగ్గురు స్త్రీలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడిందన్నారు. 23 ప్యాకెట్లు లోని సుమారు 22 కేజీల గంజాయితో పాటు వారి వద్ద ఉన్న 13300 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పట్టుబడిన వారిలో 8 మందిపైన పీడీ యాక్ట్ పెట్టేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. గంజాయి వ్యాపారం చేస్తున్న వారు మారకపోతే జిల్లా నుండి బహిష్కరణ చేస్తామన్నారు. గంజాయి మాదకద్రగాల నివారణ కోసం కళాశాలలో ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో 91 లతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు.