Sunday, November 24, 2024

సుగుటూరు గంగమ్మ జాతర కరోనా నియమాల నడుమనే నిర్వహణ

పుంగనూరు పట్టణంలో ప్రతి యేడు అత్యంత వైభవంగా జరుపుకునే ప్రసిద్ధిగాంచిన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను ఈ యేడు కూడా నిర్వహించడంలో అధికారులకు కరోనా ఒక సవాల్ గా మారింది.ఈ నేపథ్యంలో కరోనా నియమ నిబంధనల నడుమ జాతరను వైభవంగా నిర్వహించనున్నట్లు ఎంపి రెడ్డెప్ప తెలిపారు.సుగుటూరు గంగమ్మ జాతర నిర్వహణ పై మున్సిపల్‌ కమిషనర్‌ కె.ఎల్‌.వర్మ, చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో సోమవారం అన్ని శాఖల అధికారులు, వ్యాపారులు, పట్టణ ప్రముఖులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఎంపి, జమీందారు మల్లిఖార్జునరాయల్‌ విచ్చేసారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు పట్టణంలో కరోనా తీవ్రమౌతున్న నేపధ్యంలో ముందస్తు కరోనా నియమ నిబంధనల నడుమ పగడ్భందీగా జాతరను నిర్వహించాలన్నారు.

అంతర్రాష్ట్ర బంధువులను ఆహ్వానించక పోవడం శ్రేయస్కరం
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపద్యంలో తమిళనాడు, కర్నాటక నుంచి వచ్చే బంధుమిత్రులను ఈ యేడు జాతరకు పట్టణ ప్రజలు దయచేసి ఆహ్వానించక పోవడం శ్రేయస్కరం అని కమీషనర్ కె.ఎల్ వర్మ సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా చూడాలన్నారు.అలాగే అమ్మవారి గెరిగెలను తీసుకొచ్చి మొక్కులు చెల్లించే సమయంలో కుటుంబ సభ్యులందరు రావడం ఆనవాయితీగా ఉందని, దీనిని కట్టడి చేసి, మొక్కు చెల్లించే వారు మాత్రమే రావడం చేయాలన్నారు. భక్తులు యధావిధిగా గుంపులుగా రావడం, ఆలయ ప్రాంగణంలో ఉండటంతో కరోనా తీవ్రమౌతుందని , దీనిని నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

బహిరంగ దుకాణాలు నిషేదం
ఆలయ సమీపంలో అత్యంత రద్దీగా ఉండే సమీప తేరువీధి, నాగపాళ్యెం, ప్యాలెస్‌ కాంపౌండు ప్రాంతాలలో దుకాణాల ఏర్పాటును నిషేధించామన్నారు. అలాగే రంగుల రాట్నాలు, జెయింట్‌వీల్స్ ఏర్పాటు చేయరాదన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్దీకరిస్తూ , సమస్యలు లేకుండా చూడాలన్నారు. డాక్టర్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పట్టణంలో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, సీఐ ప్రసాద్‌బాబు, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు, కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి,వైద్యాధికారి డాక్టర్ రెడ్డి కార్తీక్ వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌,ప్రముఖులు,వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement