Tuesday, November 26, 2024

చిత్తూరులో ఇక మాస్కులు ధరించకుంటే.. ఫైన్

చిత్తూరు – కోవిడ్-19 వైరస్ మళ్లీ విజృంభించే పరిస్థితులు కనిపిస్తుండడంతో చిత్తూరు నగరంలో ప్రతి పౌరుడు కచ్చితంగా మాస్కు ధరించాలని, మాస్కు ధరించని వారికి ఆదివారం నుంచి ఫైన్ (అపరాధ రుసుము) విధిస్తామని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ చెప్పారు. చిత్తూరు నగరంలో ఇటీవల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా… నియంత్రణ చర్యల్లో భాగంగా… శుక్రవారం నగరపాలక కార్యాలయంలో నగర స్థాయి కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా నగరంలో చాలా చోట్ల ప్రజలు మాస్కులు లేకుండా తిరగడం, విద్యాసంస్థలు, హోటళ్లు, మాల్స్, సినిమా థియేటర్లు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో కోవిడ్-19 నిబంధనలు సక్రమంగా పాటించడంలేదని.. ఇందుకోసం పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేయడంతో పాటు, మాస్కులు ధరించనివారికి అక్కడికక్కడే ఫైన్ వేయడం, నిబంధనలు పాటించని యాజమాన్యాలకు అపరాధ రుసుం విధించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఫాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఖచ్చితంగా రెడ్ జోన్ బ్యానర్ ఏర్పాటు చేయాలని, కొవిడ్-19 ప్రోటోకాల్ పాటించాలన్నారు. పాజిటివ్ వ్యక్తి బయట తిరగకుండా ఐసోలేషన్ లో ఉండేలా నిత్యం పర్యవేక్షించాలని, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ గుర్తించి.. వారికి పరీక్షలు చేయడంతోపాటు హోం క్వారంటైన్ ఉంచాలన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్, మార్కెట్ ప్రాంతాల్లో సర్వే లైన్స్ సర్వే చేయించాలన్నారు. మాస్కులు, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించడం పై అవగాహన కార్యక్రమాలు కల్పించాలన్నారు. సమావేశంలో టీపీవో నాగేంద్ర, ఎస్సై మల్లికార్జున్, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ అనురాధ, డాక్టర్ బాలాజీ, డీటీ మోహన్ సుబ్రమణ్యం, శానిటరీ ఇన్ స్పెక్టర్ జగన్, ఎఎస్వో నరసింహ, ఐసీడీఎస్, ఏపీఎస్పిడిసిఎల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement