పుంగనూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : పర్యావరణ సమస్యలను అధిగమించడంతో పాటు సంస్థ ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగానే ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్ బస్సులను ప్రవేశ పెడుతున్నట్టు రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ అండ్ మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆయన చిత్తూరు లోక్ సభ సభ్యుడు రెడ్డెప్పతో కలిసి పుంగనూరు నుంచి తిరుపతికి వెళ్లే కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించారు. కొంతదూరం మంత్రి, ఎంపీ తదితరులు బస్సులో టికెట్ తీసుకుని మరీ ప్రయాణించారు.
అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు ప్రజా రవాణా సంస్థను ఆదరిస్తున్నారని ఆ కారణంగానే ఇటీవల కాలంలో పెరిగిన కలెక్షన్లు పెరిగాయన్నారు. అత్యంత సురక్షితమైన ప్రజా రవాణా సంస్థను ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని, ఇటీవల కాలంలో ఎక్కువ మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణించడమని, దానికనుగుణంగా అన్ని అభివృద్ధి చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఆర్టీసీలో వివిధ కారణాలతో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ కార్యాలయాల్లో వారి సభ్యులకు ఉపాధి అవకాశం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా సంస్థ అధికారి జితేంద్ర రెడ్డి, జి.మున్సిపల్ చైర్మన్ ఆలీ, తదితరులు పాల్గొన్నారు.