కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
ఏడాదికోసారి సర్కార్ సేవలుగా విశేషపూజ, సహస్రకలశాభిషేకం
సాలకట్ల ఉత్సవంగా వసంతోత్సవం
తిరుమల -* ఏప్రిల్ 14వ తేదీ నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు/ఉత్సవాలకు భక్తులను అనుమతిస్తామని టిటిడి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్జిత సేవలు/ఉత‌్సవాల్లో పాల్గొనే గృహస్తులు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. గృహస్తులు సేవకు మూడు రోజులు ముందు పరీక్ష చేయించుకుని కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్‌ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేసింది. ఉత్సవమూర్తులను సంరక్షించడంలో భాగంగా ప్రతి సోమవారం నిర్వహించే విశేషపూజ, ప్రతి బుధవారం నిర్వహించే సహస్రకలశాభిషేకం సేవలను ఇకపై సంవత్సరానికి ఒకసారి సర్కార్ సేవలుగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. అదేవిధంగా, వసంతోత్సవాన్ని సంవత్సరానికి ఒకసారి సాలకట్ల ఉత్సవంగా నిర్వహించనుంది. ఈ మూడు సేవలను ముందస్తుగా బుక్ చేసుకున్న భక్తులు వీటికి బదులుగా బ్రేక్ దర్శనం లేదా సదరు టికెట్ మొత్తాన్ని రీఫండ్ పొందే సదుపాయాన్ని టిటిడి కల్పించింది. బ్రేక్ దర్శనం టికెట్లు విడుదల చేసే తేదీలను, రీఫండ్ పొందాల్సిన తేదీలను త్వరలో తెలియజేయడం జరుగుతుంది.
అదేవిధంగా, 2020 మార్చి 20 నుండి 2021 ఏప్రిల్ 13వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, సహస్రకళశాభిషేకం, తిరుప్పావడ, మేల్‌చాట్ వస్త్రం, పూరాభిషేకం, పునుగు పాత్ర, కస్తూరి పాత్ర, నిజపాదదర్శనం ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు వీటికి బదులుగా బ్రేక్ దర్శనం లేదా సదరు టికెట్ మొత్తాన్ని రీఫండ్ పొందే సదుపాయాన్ని టిటిడి కల్పించింది. కోవిడ్-19 నేపథ్యంలో ఈ సేవలకు భక్తులను అనుమతించడం సాధ్యం కాని పరిస్థితుల్లో టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. బ్రేక్ దర్శనం టికెట్లు విడుదల చేసే తేదీలను, రీఫండ్ పొందాల్సిన తేదీలను త్వరలో తెలియజేయడం జరుగుతుంది.