తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి దాదాపు 36 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూలైన్లలోని భక్తులకు అన్న ప్రసాదాలు, తాగునీరు, పాలు అందజేస్తున్నారు. తోపులాట జరగకుండా ముందు జాగ్రత్తగా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుంది. భక్తుల రద్దీ దృష్టా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. నిన్న శ్రీవారిని రికార్డుస్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. 92,328 మంది భక్తులు దర్శించుకోగా 52,696 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.36 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.