Tuesday, November 26, 2024

కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరిని ఆసుపత్రిలో చేర్చుకోవాలి – నారాయణ డిమాండ్

సిఫార్సులకు చోటిస్తే సహించేది లేదు
తిరుపతి ఆసుపత్రులలో 1000 బెడ్లు సిద్ధంగా ఉంచాలి
మాస్క్ లేదనే నెపంతో రూ.రెండు వేలు అపరాధ రుసుం వసూలు దుర్మార్గం
కోవిడ్ అక్రమాలను నిలదీసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా ఉండాలి

తిరుప‌తి – కోవిడ్ సోకిన ప్రతి బాధితుడిని ఆసుపత్రులలో చేర్చుకుని వారికి మెరుగైన వైద్యం అందించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ డిమాండ్ చేశారు. కరోనా రెండవ దశ లో విజృంభిస్తోందని రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయని, కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను పెంచాలని కోరారు. కరోనా బాధితుల సమస్యలపై సోమవారం ఉదయం తిరుపతి స్విమ్స్ పరిపాలనా భవనం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ తో కోవిడ్ వైద్య సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరానికి ప్రతిరోజు 80 వేల మంది ఇతర ప్రాంతాల నుండి వస్తున్నారని, మరోవైపు ఉప ఎన్నికల నేపథ్యంలో వేలాది మంది గుమికూడుతున్నరని కరోనా విస్తరించే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి కరోనా ఆసుపత్రిలో 1000 బెడ్లు సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు ఉంటేనే చేర్చుకుంటున్నార నే ఆరోపణలు ఉన్నాయని, దీనికి స్వస్తి పలికి పాజిటివ్ వచ్చినా ప్రతి ఒక్కరిని ఆసుపత్రిలో చేసుకొని వైద్యం అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు ధరించుకోని వారిపై రెండు వేల రూపాయలు అపరాధ రుసుం విధించడం చూస్తే శవాలపై పేలాలు ఏరుకునే రకంగా ఉందన్నారు. మాస్కులు లేనివారికి కొనుగోలు చేయించి అవగాహన పెంచాలే తప్ప అడ్డగోలుగా దోచుకోవడం తగదని అన్నారు. ఈ దోపిడీకి స్వస్తి పలకాలని లేనిచో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. కరోనా బాధితుల సమస్యలపై పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి వారి వైద్య సేవల కోసం సైనికు ల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ సవరించిన కరోనా నిబంధనల మేరకు ఆసుపత్రులలో బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఆసుపత్రిలో 100 బెడ్లు నుండి 450 బెడ్ లకు పెంచడం జరిగింది అన్నారు. పాజిటివ్ వచ్చిన బాధితుడి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇన్ పేషంట్ సేవలు అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి జనార్ధన్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి నదియా, ప్రమీల, ఏఐటీయూసీ నాయకులు శివ, రాజా, గోవింద స్వామి, శ్రీ రాములు, ఎన్.డి రవి, చంద్రశేఖర్ నాయుడు, సిహెచ్ శివ, మహేంద్ర, సూరి, శ్రీను, మురళి, బాబు, ఏఐఎస్ఎఫ్ నాయకులు శశి, ఉదయ్, చలపతి, ఏఐవైఎఫ్ నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement