Monday, November 18, 2024

ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి : టీటీడీ జేఈవో సదా భార్గవి

తిరుపతి : టీటీడీ గోశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర బత్తీల రెండో యూనిట్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. అధికారులతో కలసి మంగళవారం ఆమె ఈ పనుల ప్రగతిని పరిశీలించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ లో చివరి దశలో ఉన్న సివిల్, విద్యుత్ , యంత్రాల పనితీరు పరిశీలన పనులు వారం రోజుల్లోపు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. అనంతరం ఆమె అగరబత్తీల తయారీ రెండో యూనిట్ పనులు పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి అవసరమైన పూల సరఫరా, ఇతర ఏర్పాట్ల గురించి జేఈవో అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సదా భార్గవి మీడియాతో మాట్లాడారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటుతో గోశాలలోని గోవులు, ఎద్దులు, ఇతర జంతువులకు నాణ్యమైన దాణా తయారు చేసి అందించవచ్చునన్నారు. భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో అగరబత్తీల ఉత్పత్తిని డబుల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జేఈవో వివరించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర బత్తీల రెండో యూనిట్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. పశువైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ పద్మనాభ రెడ్డి, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement