Saturday, November 23, 2024

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ తప్పనిసరి ..జిల్లా కలెక్టర్ హరినారాయణన్

అత్యవసరం అయితేనే బయటకి రండి . .
మాస్క్ ధరించి . . భౌతిక దూరం పాటిద్దాం ..
రెండవ డోస్ వ్యాక్సినేషన్ కు అర్హత కలిగిన వారు తప్పక వ్యాక్సినేషన్ చేయించుకోండి..
2020 మార్చి నుండి ఇప్పటి వరకు … ఒక లక్షా ఆరు వేల కేసులు నమోదు …
ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసులు 9,481..
కోవిడ్ చికిత్స కొరకు జిల్లా వ్యాప్తంగా….
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1929 పడకలు,
26 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1480 పడకల సామర్థ్యం సిద్ధం ..
బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించకపోతే రూ. 100 జరిమానా
చిత్తూరు – కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ తప్పనిసరి …. అత్యవసరం అయితేనే బయటకి రండి . . మాస్క్ ధరించి . . భౌతిక దూరం పాటిద్దాం ..అని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో కోవిడ్ కు సంబంధించి జిల్లాలో సిద్ధం చేసిన పడకల సామర్థ్యం, వ్యాక్సినేషన్, ఇతర సంబంధిత అంశాల పై విలేకరుల సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ వి. వీరబ్రహ్మం, డిఎం అండ్ హెచ్ఓ డిసిహెచ్ఎస్ లు డాక్టర్ పెంచలయ్య, డాక్టర్‌ సరళమ్మలతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 సం.ల పై బడిన వారు మొదటి డోస్ వేయించుకుని రెండవ డోస్ వేయించుకొనని వారు అందరూ గురువారం వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం దాదాపుగా 4 లక్షల 77వేల డోస్ లు వ్యాక్సిన్ వేయడం జరిగిందని తెలిపారు. మొదటి డోస్ తీసుకున్న 4 వారాల తరువాత రెండవ డోస్ వ్యాక్సినేషన్ చేయించుకోవలసి ఉన్నదని, జిల్లాలో ఉన్న అన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, సి హెచ్ సి ల్లో మొదటి డోస్ వేయించుకుని రెండవ డోస్ కు అర్హత కలిగిన వారు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఒకే రోజున 60 వేల 500 డోస్ లు 45 సం.లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని, జిల్లా యంత్రాంగం ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా పూర్తి స్థాయిలో అందరూ వ్యాక్సిన్ వేసుకున్నట్లైతే కోవిడ్ ను నియంత్రించేందుకు అవకాశం కలదని తెలిపారు.
కోవిడ్ కు సంబంధించి 2020 మార్చి నుండి ఇప్పటి వరకు ఒక లక్షా ఆరు వేల కేసులు నమోదు కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,481 లు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ఆసుపత్రులలో పడకల సామర్థ్యం మరియు కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాట్లలో భాగంగా గత సంవత్సరం యుద్ధ ప్రాతిపదికన చేసిన ఏర్పాట్లతో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులు తిరుపతి స్విమ్స్, రుయా, జిల్లా ప్రధాన ఆసుపత్రి, మదనపల్లె, కుప్పం, శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రులలో మొత్తం 1,929 పడకలు అందుబాటులో ఉన్నవని చెప్పారు. వీటితో పాటు 26 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,480 బెడ్లు సిద్ధం చేశామన్నారు. రాష్ట్రం లోనే అత్యధికంగా బెడ్ల సామర్థ్యం మన జిల్లాలోనే సిద్ధం చేశామని , ఇంకా పడకల సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి 3 కోవిడ్ కేర్ సెంటర్లైన పద్మావతి నిలయం, విష్ణు నివాసం, ఆర్ వి ఎస్ మెడికల్ కాలేజీ, చిత్తూరులో ఏర్పాటు చేయడమైనదని అన్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్లే కాకుండా వీటిని వికేంద్రీకరిస్తూ 50 పడకలతో కూడిన కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని మదనపల్లె సబ్ కలెక్టర్ కు సూచించామని తెలిపారు. టెస్టింగ్ కు సంబంధించి స్విమ్స్ లో ఉన్న ల్యాబ్ లో సామర్థ్యాన్ని పెంచి పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ అత్యవసరమైతేనే మాస్క్ ధరించి ఇంటి నుండి బయటకు రావాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించకపోతే రూ. 100 జరిమానా విధిస్తారని , దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తప్పక మాస్క్ లు ధరించాలన్నారు. ప్రతి పౌరుడు మాస్క్ ను తప్పనిసరిగా ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని, ప్రజలు వారి పనులు చేసుకుంటూ సామాజిక భాద్యతతో వ్యవహరించాలని తెలిపారు. యువత ముఖ్యంగా సామాజిక భాద్యతతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement