తిరుపతి సిటీ, మే 22 (ప్రభ న్యూస్) : అగ్ని ప్రమాదాల మిస్టరీని చంద్రగిరి పోలీసులు చేదించారని అదనపు ఎస్పీ అడ్మిన్ వెంకట్రావు తెలిపారు. సోమవారం ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ.. కొత్త శానంభట్లలో ఇటీవల జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు సంబంధించి తల్లి ప్రవర్తన నచ్చకపోవడమే వరుసగా ఘటనలకు ప్రధాన కారణమని వివరించారు. గడ్డివాముకు నిప్పంటుకున్న ఘటనను అదునుగా చేసుకుని మరో గడ్డి వాముకి నిప్పు పెట్టడం జరిగిందని పిల్లపాలెంకు చెందిన కీర్తి తన తల్లి ప్రవర్తన మార్పు కోసం ఓర్పుగా ఇలాంటి పనులు చేయడం జరిగిందని తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి రసాయనాలు వినియోగించలేదన్నారు. ఇందులో ఎలాంటి తాంత్రిక శక్తి యాంత్రిక శక్తులు వినియోగించలేదని వివరించారు.
తన ఇంట్లోనే మూడుసార్లు నిప్పును యువతి పెట్టడం జరిగిందన్నారు. ప్రమాదాల్లో నగదును తస్కరించిన వాటిల్లో రూ.32 వేలు రికవరీ చేయడం జరిగిందన్నారు. కీర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడం జరిగిందని తెలియజేశారు. అగ్గిపెట్టెతోనే కీర్తి మంటలు పెట్టినట్లు ఒప్పుకోవడం జరిగిందన్నారు. తల్లి ప్రవర్తన మార్పు కోసం ఇలాంటి పనులు చేయడం జరిగిందని ఒప్పుకోవడం జరిగిందన్నారు. వారి బంధువుల ఇళ్లల్లో అగ్గిపుల్ల ద్వారా ముందుగా కాల్చివేసింది అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగితే ఏదో కీడుగా భావించి తల్లితోపాటు ఊరు వదిలే అవకాశం వస్తుందని భావించడం జరిగిందని కీర్తి తెలియజేశారన్నారు. గ్రామంలోని కొందరితో ఉన్న గొడవల కారణంగా వారి ఇళ్లల్లోనూ మంటలు పెట్టడం జరిగిందన్నారు. మూఢ నమ్మకాలు నమ్మకం అంటేనే తన ఇంట్లో మూడుసార్లు నిప్పు పెట్టడం జరిగిందని యువతి పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి కీర్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.