తిరుపతి: తిరుపతి ఉపఎన్నికలో వైసిపి దొంగ ఓట్లు వేయించిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.. ఈ తిరుపతి అసెంబ్లీ పరిధిలో ప్రస్తుతం జరిగిన పోలింగ్ ను రద్దు చేసి, రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, రీపోలింగ్ కోరుతూ ఒక లేఖను అందజేశామని చెప్పారు. వైసిపి అరాచకాలపై తాము అందజేసిన ఆధారాలను పరిశీలించి , కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.. తిరుపతిలో దొంగ ఓట్లు వేయిస్తున్నారని సాక్షాత్తు తమ పార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మీ పోలీంగ్ కేంద్రాలలో పర్యటించిన సమయంలో పోలీసుల దృష్టికి తెచ్చారని, కొంత మంది దొంగ ఓటర్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు.. అలాగే బిజెపి అభ్యర్ధి రత్నప్రభ, ఆ పార్టీ సీనియర్ నేత శాంతారెడ్డిలు వైసిపి దొంగ ఓట్ల భాగోతాన్ని బయటపెట్టారని, అలాగే దొంగ ఓటర్లను పోలీసులకు పట్టివ్వడమే కాకుండా, పలు ప్రైవేటు వాహనాలను సీజ్ చేయించారని వివరించారు.. అన్ని పార్టీలు దొంగ ఓట్లపై గగ్గోలు పెడుతుంటే, వైసిపి మాత్రం వాటిని ఆరోపణలను అంటూ తీసిపారేయడం ఏమిటని ప్రశ్నించారు.. తిరుపతి ఉపఎన్నికకు వందల బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సరిహద్దులు మూసివేసి తనిఖీలు చేసి పంపాల్సిందని.. ఎందుకు చెక్‌పోస్టులను ఎత్తివేశారు? అని నిలదీశారు. తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో వేల మందిని ఉంచితే.. పోలీసులు నిద్రపోతున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. దొంగ ఓటర్లను పట్టిస్తే టీడీపీ నాయకులను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. బందిపోట్లను మైమరిపించేలా వైసీపీ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. తండ్రి పేరు చెప్పలేని వాళ్లు దొంగ ఓటర్లు కాక మరేంటి? అని ప్రశ్నించారు. మంత్రులు బరితెగించి తిరుపతిలో ఉంటే అధికార పార్టీకి ఊడిగం చేస్తామన్నట్లు పోలీసుల తీరుందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. వైసీపీ మాఫియా చేతిలో ప్రజాస్వామ్యం బలైపోవాలా? అని చంద్రబాబు నిలదీశారు. ఎక్కడి నుంచో ముఠాలను దించి తిరుపతిపై దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై అరాచకాలు చేశారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఏం పని?.. ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు.. వైసీపీ మరో వైపు ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని చెప్పారు. ఎన్నికల కమిషన్ పంపిన మైక్రో అబ్జర్వర్లు ఏమయ్యారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలానే వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌పై నమ్మకం పోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement