తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నిన్న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, తోమాల సేవ నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్ సేవ నిర్వహిస్తారు. అనంతరం వాహనమండపంలో శ్రీ సుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై వేంచేపు చేస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. కాగా మంగళవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం :
శ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్ కోయిల్ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు (ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తోంది.