తిరుపతి : మనం చదువుకునే చందమామ కథల సమూహంగా రూపొందించబడిన చిత్రమే బింబిస నని, ఈ చిత్రం అద్భుతంగా ఉండి అభిమానులను ఎవరిని అసంతృప్తి పరచదని ఆ చిత్ర కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. ఆదివారం కపిలతీర్థం కూడలి వద్దనున్న ప్రముఖ హోటల్ వై వైస్రాయ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చిత్ర బృందంతో కలిసి మాట్లాడారు. ఇటువంటి కథ చిత్ర రంగంలో ఇంతవరకు ఎవరు చిత్రించలేదని గుర్తు చేశారు. ఈ కథ గొప్పతనం కథానాయకుడు బింబిస లాంటి పాత్రను ఎన్ని భాగాలలో అయినా చిత్రీకరించవచ్చునని తెలియజేశారు. ఈ సినిమా చిత్రీకరణలో టెక్నీషియన్లు, దర్శకుడు వశిష్ట. కెమెరామెన్ చోటా కె నాయుడు, సంగీత దర్శకుడు కీరవాణి, కథ నాయకురాలు కేథరిన్ ఐరా పాత్రగా, సంయుక్త పాత్రలో వైజయంతిలు బృందం అంతా కలిసి ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు.
చిత్రం పెద్ద హిట్ కావాలని శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్టు, అభిమానులందరూ చిత్రం చూసి ఆదరించాలని కోరారు. దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ వైవిద్యమైన కథతో ఈ చిత్రం రూపుదిద్దుకున్నదని, కథానాయకుడిగా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారని ప్రతి ఒక్కరూ చిత్రాన్ని చూడాలని కోరారు. సీనియర్ కెమెరామెన్ చోటా కె నాయుడు మాట్లాడుతూ 85 సినిమాలు చేసిన అనుభవానికి భిన్నంగా ఈ కథ అద్భుతంగా ఉన్నదని, కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని తెలుగు సినిమాకు ఈ చిత్రం ఒక కొత్త రూపంగా కనపడుతుందన్నారు. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దర్శకుడు వశిష్ట రాసిన ఈ చిత్రంలో కథానాయకుడు కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూస్తారని, ప్రేక్షకుల ఆశీస్సులు తప్పకుండా కావాలని కోరారు.