Wednesday, November 20, 2024

AP | యువతిపై హత్యాయత్నం.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): ప్రియురాలిపై దాడి చేసిన వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి తిరుపతి సునీత రాణి తీర్పు చెప్పారు. వివరాలు.. చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పిడతల మహేష్ వర్మ తన ఇంటి పక్కనే ఉంటున్న నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు.

కొద్ది రోజులకు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరోజు మహేష్ తన ప్రేయసిని పెళ్లి చేసుకుందామని అడగ్గా తన చదువు మరో రెండు నెలలలో పూర్తవుతుందని ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని సమాధానం ఇచ్చింది. దీంతో అనుమానం పెంచుకున్న మహేష్ గత మార్చి ఒకటిన యువతితో వాగ్వాదానికి దిగి… కత్తితో దాడి చేశాడు.

బాధితురాలి అమ్మమ్మ గట్టిగా అరుస్తూ కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అధికారి ఎస్ఐ అనిత తగిన సాక్షాధారాలతో కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేశారు. నేరం నిరూపణ కావడంతో నిందితుడికి ఐదేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి సునీత రాణి గురువారం తీర్పు వెలువరించారు.

కేసు నిరూపణకు కృషి చేసిన ఎస్సై అనిత గారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీదేవి, కోర్ట్ కానిస్టేబుళ్లు రామకృష్ణ, దేవేంద్ర, చంద్రగిరి పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్సీ సుబ్బరాయుడు అభినందించారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, అలాంటి కేసులలో సత్వరమే బాధితులకు న్యాయం చేస్తూ నిందితులను శిక్షపడేలాగా సమర్థవంతంగా పోలీస్ శాఖ పని చేస్తుందని చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement