Tuesday, November 26, 2024

అసిస్టెంట్ ఇంజనీర్లపై పని భారాన్ని తగ్గించాలి

తిరుపతి రూరల్ – రాష్ట్రంలో పని చేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్లపై పని భారాన్ని తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు పేర్కొన్నారు. ఎపి పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ల అసోసియేషన్ చిత్తూరు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ లపై తీవ్రమైన పని భారం పడుతోందని అన్నారు. ఇది అసిస్టెంట్ ఇంజనీర్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తమపై పని భారాన్ని తగ్గించాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సిసి రోడ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనుల్లో చోటుచేసుకున్న అవకతవకలను అసిస్టెంట్ ఇంజనీర్లకు అంటగడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అత్యంత బాధ్యతతో నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. పీఆర్సీని అమలు చేయాలని సూచించారు. పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కోశాధికారి కేశవులు మాట్లాడుతూ.. సమస్యలపై అసిస్టెంట్ ఇంజనీర్లు ఐకమత్యంతో పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన నైతిక, ఆర్థిక సహకారాన్ని క్షేత్ర స్థాయిలోని అసిస్టెంట్ ఇంజనీర్లు అందించాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లో ఏపీ పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ల అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు మాధవ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ కెవి రమణ, నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement