Saturday, November 23, 2024

అన్నమయ్య గొప్ప సామాజికవేత్త : భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి

తిరుపతి : భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానమేనని తన సంకీర్తనల ద్వారా చాటి చెప్పిన తాళ్లపాక అన్నమయ్య గొప్ప సామాజికవేత్త అని శ్వేత మాజీ సంచాలకులు భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి (భూమన్)చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న తాళ్లపాక అన్నమాచార్యుల 615వ జయంతి ఉత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన భూమన్ “అన్నమయ్య – సామాజికత” అనే అంశంపై ఉపన్యసించారు. 600 సంవత్సరాల క్రితం అప్పటి సామాజిక పరిస్థితులకు వ్యతిరేకంగా అన్నమయ్య గళం విప్పారని చెప్పారు. పలు సంకీర్తనల్లో ఆనాటి గ్రామీణ పరిస్థితులు, పాడి పంటలు, సాగునీరు, కుటుంబ సంబంధాలు తదితర అంశాలను తెలియజేశారని అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు ఉండాలని నొక్కి చెప్పారని తెలిపారు. అత్యంత సంస్కారవంతంగా శృంగార సంకీర్తనలు రచించి భక్తి భావాన్ని వ్యాప్తి చేశారని తెలియజేశారు. తాను శ్వేత డైరెక్టర్ గా పనిచేసిన కాలంలో అన్నమయ్య స్ఫూర్తితోనే శ్వేతలో గిరిజన, దళిత, మత్స్యకార ఇతర వెనుకబడిన వర్గాల వారికి అర్చక శిక్షణ ప్రారంభించామని గుర్తు చేశారు. అన్ని మతాలవారు వేంకటేశ్వర స్వామివారిని కొలిచారని తెలిపారు.

అన్యమతాలకు చెందిన ప్రభువులు, రాజులు తిరుమల సందర్శించినప్పుడు స్వామివారికి సమర్పించిన కానుకలను తిరుమల కొండపై ఇప్పటికీ చూడవచ్చన్నారు. అనంతరం బెంగళూరుకు చెందిన ఆచార్య జీఎస్ మోహన్ “అన్నమయ్య – పురందరదాసులు” అనే అంశంపై ఉపన్యసించారు. ఇద్దరి సంకీర్తనలు జానపద శైలిలో, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉంటాయని తెలియజేశారు. విజయవాడకు చెందిన డా. రాజ్యలక్ష్మి “అన్నమయ్య – దివ్య ప్రబంధములు” అనే అంశంపై ఉపన్యసించారు. అళ్వార్లు దివ్య ప్రబంధంలో అందించిన అంశాలన్నింటినీ అన్నమయ్య తన సంకీర్తనల్లో ప్రతిబింబించారని వివరించారు. సాయంత్రం 6 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీ జి.నాగేశ్వర నాయుడు బృందం సంగీత సభ, రాత్రి 7 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి జ్యోత్స్న బృందం హరికథా గానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, తుడ కార్యదర్శి లక్ష్మి ఇతర అధికారులు, క‌ళాకారులు విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement