తిరుపతి : శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయ కులపతి, టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, వారి త్యాగ ఫలితమే ఈనాటి అమృతోత్సవం అన్నారు. ఆ స్పూర్తితో వేద విశ్వవిద్యాలయ ఉన్నతికి అహర్నిశలూ కృషి చేయాలని, వేద విద్య పరిరక్షణ మనందరి బాధ్యతన్నారు. దేశంలో ఉన్న అన్ని వేద పాఠశాలలను ఏకీకృతం చేసి వేద విశ్వవిద్యాలయంతో అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. వేద విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు ఉచితంగా కల్పిస్తున్నామని, బాగా చదువుకుని విజ్ఞానవంతులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. 2009 నుండి ఉన్న అడహాక్ లెక్చరర్ల సమస్యను పరిష్కరించి, వారిని పర్మినెంట్ చేశామని 2009 నుండి వారి సర్వీసులు గుర్తిస్తున్నామని, అధ్యాపకులు బోధన-పరిశోధన అంశాలలో రాజీ పడకుండా కృషి చేయాలన్నారు. ఈ సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ పటిష్ఠంగా నిర్మించామని దానిని అనుసరించి అకడమిక్ వ్యవస్థను పటిష్ఠంగా నడపాలన్నారు. అధ్యాపకులు, విద్యార్థులకు ఉపన్యాస కౌశలాన్ని పెంపొందించేందుకు శ్రుతసంవర్ధిని, గవేషణ మొదలైన సభలను విశ్వవిద్యాలయం నిర్వహిస్తుందని, దీని ద్వారా విద్యార్థులు అధ్యాపకులు చక్కని ఉపన్యాసకులుగా తయారవుతారని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ధనంజయ ద్వివేది, గురు ప్రసాద్, రోషన్ పాఠక్, ధీరజ్ దేశ భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా.ఎవి.రాధేశ్యామ్, అకడమిక్ డీన్ డా.ఫణియజ్ఞేశ్వర యాజులు, సంచాలకులు డా.సీతారామారావు, శ్రీ రామకృష్ణ, పిఆర్వో డా. బ్రహ్మచార్యులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement