తిరుపతి సిటీ : తిరుపతి జిల్లా పరిధిలోని వెంకటగిరి పట్టణంలో సంచలనం సృష్టించిన నగలు దుకాణం దొంగతనం కేసును ఛేదించడం జరిగిందని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ… చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న యువకుడు బాలయ పల్లి మండలంలోని అలిమిలి గ్రామంకు వెళ్లే దారిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నూకతోటి వెంకటయ్య ఆటోలో వెళుతుండగా అతన్ని పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇతను బాలయపల్లి మండలం జయంపు గ్రామం హరిజన వాడకి చెందిన పెంచలయ్య కుమారుడు నూగుతోటి వెంకటయ్య (22) అని వివరించారు. ఇతను వెంకటగిరి పట్టణంలోని ఆర్. వి. ఎం. స్కూలుకి ఎదురుగా రాజా వీధికి సమీపంలో ఉన్న ఎల్వి నాయుడు పాన్ బ్రోకర్, షాపు నగలు దుకాణంలో ఈనెల తొమ్మిదో తేదీ అర్ధరాత్రి వేణుకు వైపు గోడకు కన్నం వేసి అందులో ఉన్న 600 గ్రాముల బంగారు నగలు తోపాటు ఐదు కేజీల వెండి వస్తువులు, రూ.50 వేల నగదును దొంగలించడం జరిగిందన్నారు.
అలాగే గూడూరు పట్టణంలోని వెంకటగిరి రోడ్డుకు సమీపంలో సుప్రజా స్టిల్ అంగడికి కన్నం వేసి గల్ల పెట్ లో ఉన్నరూ.3000ల నగదు, ముత్యాలపేటలోని గాంధీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందు బిస్మిల్లా రైస్ షాప్ నందు గల్లపెట్టెలో ఉన్నరూ.15000ల నగదు దొంగతనం చేశారన్నారు. అలాగే ఈ దొంగతనాలకు సంబంధించి 637.135 గ్రాముల బంగారు నగదు విలువ 28,67,107 రూపాయలని తెలిపారు. 4,982 కేజీల వెండి వస్తువులు, నగదు 13000తోపాటు ఒక ఆటో నేరానికి ఉపయోగించిన ఇనుప గుణపమును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దొంగతనాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దొంగతనం చేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో క్రైమ్ అదనపు ఎస్పి విమల కుమారి, గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి, వెంకటగిరి సీఐ రామకృష్ణ, ఎస్ఐ జిలాని భాష, ఐడి పార్టీ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు.