తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తిరుపతి జిల్లా పోలీసు శాఖ సిబ్బంది కోసం హీరో మోటార్స్ యాజమాన్యం కార్పొరేట్ సామాజిక భాద్యత (CSR)లో భాగంగా శుక్రవారం 120 హీరో గ్లామర్ మోటార్ బైక్ లను వితరణ చేసింది. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో హీరో ఆటోమొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ చక్రవర్తి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణ రెడ్డి, జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డి లకు బైక్ ల కీ ని లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ… స్వంత వాహనాలతో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అధునాతనమైన పరికరాలు అమర్చిన 120 ద్విచక్ర వాహనాలను అందచేయడం అభినందనీయమన్నారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల అవసరాలకు తగినట్టుగా బైకులలో అత్యాధునిక హంగులతో అమర్చిన మైక్ సిస్టం, లైట్ సిస్టం, సైరన్ సిస్టం వంటి ప్రత్యేకతలు ఉంచడం బాగుందంటూ తమ డీజీపీ కూడా హీరో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేయమన్నారని తెలిపారు. హీరో మోటార్స్, డీలర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ కంపెనీలో పనిచేసే మహిళా సిబ్బందిని షిఫ్ట్ సమయాల్లో పోలీస్ పేట్రోల్ నిర్వహించి ప్రశాంతంగా వారి ఇళ్లకు చేరేవిధంగా చూస్తున్నారని.. అందుకే ఉడతాభక్తిగా ఈ వితరణ చేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ లు జెండా ఊపి 120 ద్విచక్రవాహనాల శ్రేణిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి.లు వెంకటరావు అడ్మిన్, కులశేఖర్ ఎల్అండ్ఓ, విమల కుమారి క్రైమ్, సెబ్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర, తదితర జిల్లా పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు.