తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం ఉదయం జరిగిన 11వ విడత సుందరకాండ అఖండ పారాయణం ఆద్యంతం భక్తిభావాన్ని పంచింది. ఈ సందర్భంగా పండితులు 45వ సర్గ నుంచి 48వ సర్గ వరకు ఉన్న 156 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ పారాయణంలో భక్తులు తమ ఇళ్ల నుంచే పాల్గొన్నారు. విశ్వంలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని, కోవిడ్ – 19 వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వహిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా మంత్ర పారాయణం ప్రారంభించి 343 రోజులు పూర్తి కాగా, సుందరకాండ పారాయణానికి 281 రోజులు పూర్తయ్యాయి. సుందరకాండలోని 68 సర్గల్లో గల 2,821 శ్లోకాలను మొత్తం 16 విడతలుగా అఖండ పారాయణం నిర్వహిస్తారు. టిటిడి ఇప్పటివరకు 10 విడతలుగా సుందరకాండ అఖండ పారాయణం చేపట్టింది. 11వ విడత అఖండ పారాయణంలోని 156 శ్లోకాలను కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, పవనకుమార శర్మ, రామానుజాచార్యులు పారాయణం చేశారు. విజయవాడకు చెందిన సంగీత విద్వాంసులు రాణి శ్రీనివాసశర్మ బృందం “రామా కోదండరామా…,” సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు బి.రఘునాథ్ బృందం “శ్రీ హనుమా జయహనుమా…” సంకీర్తనతో ముగించారు.
ఈ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థకు చెందిన వేదపారాయణదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రీయ పండితులు కలిపి దాదాపు 200 మంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎ.వి. ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత వర్సిటీ ఉప కులపతి ఆచార్య మురళీధరశర్మ, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్ఆర్.రెడ్డి, డెప్యూటీ ఈవోలు లోకనాథం, నాగరాజ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డా. విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
భక్తిభావాన్ని పంచిన సుందరకాండ అఖండ పారాయణం
Advertisement
తాజా వార్తలు
Advertisement