తిరుపతి, నవంబరు 27 (ప్రభ న్యూస్ ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యుసీ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, అధికార బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఘోరంగా ఓటమి పాలవువున్నాయన్నారు. అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై చింతా మోహన్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కేవలం 4ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వస్తాయని, మరి అలాంటప్పుడు బీసీ వ్యక్తిని సీఎంగా ఎలా చేస్తారంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని, అందుకే ఆ పార్టీకి కేవలం 24 సీట్లు మాత్రమే రానున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి 4, ఎంఐఎం పార్టీకి 7, సీపీఐ కి 1 చొప్పున సీట్లు రానున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 83సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది తాను సర్వే చేసి చెబుతున్న మాట కాదని, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు నిజాయితీగా, నిష్పక్షపాతంగా చేసిన సర్వే ఫలితాలని ఆయన స్పష్టం చేశారు.
ఉపాధి నిమిత్తం టన్నెల్లోకి వెళ్ళిన కూలీలు ప్రమాదవశాత్తు అక్కడే చిక్కుకుపోయి రెండు వారాలు గడుస్తున్నా.. వారిని సురక్షితంగా బయటకు తీయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వారికి ఆకలి తీర్చేలా ఆహారం సమకూర్చలేక, ప్రాణాలను కాపాడలేకపోవడం దారుణమన్నారు. ఒక పక్క చంద్రయాన్, సూర్యయాన్ అంటూ సాంకేతికత వైపు అడుగుపెట్టిన మన శాస్త్రవేత్తలు, భూమిపై టన్నెల్లో ఇరుక్కుపోయిన వారిని ఎందుకు బయటకు తీయలేక పోతున్నారని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. దేశంలో పేదలు, ధనికులు అనే వ్యత్యాసం పెరిగిపోయిందన్నారు. తన అనుచరులకు వేలకోట్ల రూపాయలు ఆదాయం దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ద పేదలపై ప్రధాని మోడీకి లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలోని మతాలను, కులాలను వర్గాలుగా విభజించి వాటితో లబ్ధి పొందాలని చూస్తోందని బీజేపీపై ఆయన ధ్వజమెత్తారు. మన్నవరం బిల్ ఫ్యాక్టరీ దుగ్గరాజపట్నంలను ఎందుకు అభివృద్ధిలోకి తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆపై ఇందిరా గాంధీలు ఆదర్శవంతమైన పాలన చేశారని గుర్తు చేశారు. అలాంటిది వారి విగ్రహాలు పెట్టకుండా, ప్రజలు ఎప్పుడో మర్చిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయడంపై ఆయన పాలకులను నిలదీశారు. ఒక్క తిరుపతిలోనే 4 వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
- 152 మెడికల్ పీజీ సీట్లను అమ్ముకున్నారు..
- దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 152 మెడికల్ పీజీ సీట్లను దొంగతనంగా అమ్ముకున్న ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందన్నారు. వైఎస్ మెడికల్ యూనివర్సిటీ పరిధిలోని నంద్యాల, విజయనగరం, రాజమండ్రి ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎండి, ఎమ్మెస్, మెడికల్ పీజీ సీట్లను ఒక్కో సీటును 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు దొంగతనంగా అమ్ముకున్నారని ఆరోపించారు. ఎంసీఐ అనుమతి లేకుండా సాగిన ఈ మెడికల్ సీట్ల అమ్మకాల దందాలో మొత్తం రూ.500 కోట్లు దండుకున్నారని ఆయన ఆరోపించారు. ఇలా నిస్సిగ్గుగా మెడికల్ సీట్లను దొంగతనంగా అమ్ముకునే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ హెల్త్ సెక్రటరీని ఉద్దేశించి ప్రశ్నించారు. ఇదంతా ఆరోగ్య శాఖ మంత్రికి తెలిసే జరిగిందా.. అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇలా దొంగతనంగా మెడికల్ సీట్లు అమ్ముకోవడానికేనా మీరు ఎన్టీఆర్ యూనివర్సిటికి ఆపేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టుకున్నది అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చేపడుతున్న కులగణన పారదర్శకంగా జరగడం లేదని ఆరోపించారు. ఈ ప్రక్రియను ప్రభుత్వ ఉపాధ్యాయులతోనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి, బండ పాకాల ప్రభాకర్, శాంతి, తేజోవతి పాల్గొన్నారు.